
న్యూఢిల్లీ, వెలుగు:
న్యూఢిల్లీ, వెలుగు: ‘వింగ్స్ ఇండియా–2020’ అంతర్జాతీయ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ ను హైదరాబాద్ లో నిర్వహించనుండటం రాష్ట్రానికి గర్వకారణమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని, వీటిని ఈ కాన్ఫరెన్స్ లో ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్చిలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో నిర్వహించనున్న ‘వింగ్స్ ఇండియా-2020’ సదస్సుకు కర్టెన్ రైజర్ ప్రోగ్రాం గురువారం ఢిల్లీలో జరిగింది. కార్యక్రమంలో పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు, రాష్ర్టాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రతినిధులు, ఏయిరోస్పేస్, డిఫెన్స్ కంపెనీల టాప్ లీడర్ షిప్ (ప్రతినిధులు) పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదున్నర ఏళ్లుగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అయిందన్నారు. రాష్ట్రంలో 4 ఏరో స్పేస్ పార్కులున్నాయని, ఎలక్ర్టానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్స్, హర్డ్ వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్ ఉన్నాయన్నారు. త్వరలో టీ వర్క్స్ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో కొత్త ఆలోచనలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే టీ హబ్ బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏయిరోస్పేస్ స్టార్ట్ అప్స్ కంపెనీలతో పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పాలసీ తెచ్చిన తొలి రాష్ర్టంఅన్నారు.
డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ..
ఢిల్లీ పర్యటనలో కేటీఆర్
ఎయిర్ బస్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, బిఏఈ (బే) కంపెనీల ఇండియా అధిపతులతో
భేటీ అయ్యారు. ఎయిర్ బస్ ఇండియా సీఈవో అనంద్ స్టాన్లీ, సాఫ్రాన్ ఇండియా సీఈవో పియర్రీ డికెలీ, బే సిస్టమ్స్ ఎండీ నిక్ కన్నా, జీఈ ఏవియేషన్ ఇండియా అధినేత (కంట్రీ హెడ్) విక్రమ్ రాయ్, తలాస్ కంపెనీ ఉపాధ్యక్షుడు కపిల్ కిషోర్, యునైటెడ్ టెక్నాలజీస్ ప్రాంతీయ డైరెక్టర్ సమిత్ రే
లతో రాష్ట్రంలో పెట్టుబడులపై
కేటీఆర్ చర్చించారు.