
ఖమ్మం/కరకగూడెం, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న ఆయన, ముందుగా మమత కాలేజీ ఆవరణలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇటీవల అనారోగ్యానికి గురైన అజయ్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించారు. అజయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మమత కాలేజీ ఆవరణలోనే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
తర్వాత ఇటీవల చనిపోయిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కవిరాజ్ నగర్ లోని మదన్ లాల్ ఇంటికి వెళ్లి, ఆయన ఫొటోకు నివాళులర్పించారు. మదన్ లాల్ భార్య మంజులతో మాట్లాడి ఓదార్చారు. మదన్ లాల్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. కరకగూడెం మండలం కుర్ణవల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇంటికి వెళ్లాడు.
ఇటీవల రేగా తల్లి మరణించడంతో ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులలర్పించారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు అజయ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, మాజీ జడ్పీ చైర్మన్ కమల్‌రాజు, నేతలు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు ఉన్నారు.