
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ భాష వీధి రౌడీకన్నా హీనంగా ఉందని.. ఆయన తన భాషను, పద్ధతిని మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు తిరగబడుతారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలను వారు ఖండించారు.
రేవంత్ రెడ్డిపై అవాకులు, చవాకులు పేలితే కేటీఆర్ నాలుక కోస్తామని హెచ్చరించారు. అంచెలంచెలుగా ఎదిగిన నేత రేవంత్ రెడ్డి అని, బీఆర్‌ఎస్ నేతల తీరు మారని పక్షంలో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేసీఆర్ పదేండ్లుగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినా, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని వారు గుర్తు చేశారు.