25న కేయూ కాన్వొకేషన్ కు ఏర్పాట్లు

25న కేయూ కాన్వొకేషన్ కు ఏర్పాట్లు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవ సంబురానికి రెడీ అయింది. ఈ నెల 25న వర్సిటీ 22వ కాన్వొకేషన్​ నిర్వహించనున్నారు. ఆఫీసర్లు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వీసీ తాటికొండ రమేశ్​ హైదరాబాద్​ లో రాష్ట్ర గవర్నర్​ డా. తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఆహ్వానపత్రం కూడా అందజేశారు.నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ జరగనుండగా.. వందల మంది విద్యార్థులు గోల్డ్​మెడల్స్, పీహెచ్​డీ పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. చీఫ్ గెస్టుల చేతుల మీదుగా కొందరికే పంపిణీ చేస్తామనడం, ఇంకొందరికి పట్టాలు పెండింగ్ లో ఉండడం స్టూడెంట్ల విమర్శలకు కారణమవుతోంది.

నాలుగేండ్ల తర్వాత..

కేయూలో చివరి సారిగా  2018లో 21వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఆ టైంలో రాష్ట్ర గవర్నర్ హాజరుకాకపోవడంతో అప్పటి వీసీ సాయన్న, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్​రాంగోపాలరావు 538 మందికి పీహెచ్​డీ పట్టాలు, 276 మందికి గోల్డ్​మెడల్స్ అందజేశారు. అప్పటినుంచి మళ్లీ కాన్వొకేషన్ జరపలేదు. కరోనా కారణంగా ఈ ప్రోగ్రాంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. స్టూడెంట్ యూనియన్ల వినతి మేరకు ఈ నెల 25న కాన్వొకేషన్ జరిపేందుకు రెడీ అవుతున్నారు. వర్సిటీ చాన్స్​లర్​, రాష్ట్ర గవర్నర్ తో పాటు సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ బోర్డ్​(సెర్బ్) సెక్రటరీ సందీప్​ వర్మకు ఆహ్వానం పంపారు. చీఫ్ గెస్ట్​ల రాక సందర్భంగా ఆఫీసర్లు కేయూలో రోడ్ల రిపేర్లు, బిల్డింగుల డెకరేషన్​ లాంటి పనులు చేపడుతున్నారు. 

కొంతమందికే పట్టాలు, మెడల్స్

2018 లో నిర్వహించిన కాన్వకేషన్​ సందర్భంగా 2012 వరకు డిగ్రీ, పీజీలో ప్రతిభ చూపిన స్టూడెంట్లకు గోల్డ్​మెడల్స్ అందజేశారు. 2017లో అవార్డ్ అయిన పీహెచ్​డీ అభ్యర్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆ  తర్వాత స్నాతకోత్సవం ఊసే ఎత్తకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు నిరాశ చెందారు. ఈ ఏడాది స్నాతకోత్సవానికి తేదీ ఖరారు చేయడంతో అందరూ సంబురపడ్డారు.  కానీ వర్సిటీ ఆఫీసర్లు మాత్రం 2013, 2014, 2015 సంవత్సరాలకు చెందిన 192 మందికి 276 గోల్డ్​మెడల్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మిగతా స్టూడెంట్స్​కు అవకాశం ఇవ్వలేదు. పీహెచ్​డీ పట్టాల కోసం 2018 నుంచి 2022 వరకు మొత్తంగా 248 మంది స్టూడెంట్స్​దరఖాస్తు చేసుకోగా.. అందులో 2018, 2019లో పీహెచ్​డీ అవార్డ్​అయిన 56 మందికి మాత్రమే పట్టాలు అందజేయనున్నారు. 2020 నుంచి 2022 వరకు అవార్డ్​అయిన వారికి మాత్రం ఈసారి అవకాశం దక్కలేదు. దీంతో ఆయా విద్యార్థులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్టూడెంట్లు..

పీహెచ్​డీ పట్టాలు, గోల్డ్​ మెడల్స్​ చీఫ్​ గెస్ట్​ ల చేతుల మీదుగా అందజేయాల్సి ఉంటుంది. కానీ వర్సిటీ ఆఫీసర్లు మాత్రం అదంతా ఏమీ లేకుండానే గవర్నర్​ ప్రోగ్రామ్​ షెడ్యూల్ ప్రిపేర్​ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట గోల్డ్​ మెడల్స్​ ను కాన్వొకేషన్​ ప్రోగ్రామ్​ అయ్యాక ఎగ్జామినేషన్​ డిపార్ట్​మెంట్ నుంచి కలెక్ట్ చేసుకునేలా ప్లాన్​ చేశారు. పీహెచ్​డీ పట్టాలు 2018, 2019 సంవత్సరాల్లో అవార్డ్ అయిన వారికి మాత్రమే ఇచ్చేలా ఖరారు చేశారు. కాగా ఇటీవల స్నాతకోత్సవం విషయమై కేయూ వీసీ తాటికొండ రమేశ్​ ఇతర ఆఫీసర్లు వర్సిటీలోని దాదాపు 32 విద్యార్థి సంఘాలతో సమావేశమవగా.. స్టూడెంట్స్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

చీఫ్​ గెస్ట్ ల చేతుల మీదుగానే పట్టాలు, గోల్డ్ మెడల్స్​ అందజేసేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో 2013 నుంచి 2015 సంవత్సరాలకు చెందిన స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్ అందజేయడం కాకుండా 15 మంది చొప్పున గవర్నర్ తో ఫొటో సెషన్​లో పాల్గొనేలా ప్రోగ్రామ్​ లో మార్పులు చేసినట్లు తెలిసింది. 2020 నుంచి 2022 వరకు పీహెచ్​డీ పట్టాల పంపిణీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కాన్వొకేషన్​ లో అతిథుల చేతులమీదుగా పట్టాలు, గోల్డ్​ మెడల్స్ అందుకుందామనుకున్న ఎంతోమంది స్టూడెంట్స్​ తీవ్ర నిరాశలో పడ్డారు. ఇకనైనా వర్సిటీ ఆఫీసర్లు అప్లై చేసుకున్న స్టూడెంట్లందరికీ పీహెచ్​డీ పట్టాలు, గోల్డ్​ మెడల్స్ అందజేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. 

మరో కాన్వొకేషన్​ నిర్వహిస్తం

సమయాభావం వల్ల కొంతమందికి మాత్రమే గోల్డ్​ మెడల్స్​ ఇచ్చేలా ప్లాన్​ చేశాం. మిగతా మెడల్స్​ తో పాటు 2020 నుంచి 2022 సంవత్సరాల్లో అవార్డ్​ అయిన పీహెచ్​డీ పట్టాలను కూడా తొందర్లోనే అందజేస్తాం. వచ్చే డిసెంబర్​ లేదా జనవరి నెలలో మరో కాన్వొకేషన్​ నిర్వహించి, అర్హులైన విద్యార్థులందరికీ పట్టాలు, గోల్డ్​ మెడల్స్​ అందజేసేలా చర్యలు తీసుకుంటాం. 

-  ప్రొఫెసర్​ బి.వెంకట్రామిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్​