- లైంగికంగా వేధిస్తున్నారని అర్ధరాత్రి వరకు ఆందోళన
కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత పాటిమీది జగన్మోహన్ రావు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియా వేదికగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆశప్రియ అనే యువతి గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగింది. గత ఎంపీ ఎన్నికల్లో పాలమూరు సెగ్మెంట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా తాను చేసిన సేవలను గుర్తించకపోగా, తనపై వ్యక్తిగత కక్షతో గౌరవానికి భంగం కలిగేలా జగన్మోహన్ రావు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అకారణంగా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడంతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని తెలిపింది. జగన్మోహన్ రావు బయటకు వచ్చి తన తప్పు నిరూపించాలని లేదా సారీ చెప్పే వరకు ఆందోళన విరమించనని అర్ధరాత్రి వరకు కూకట్పల్లి పాపారాయుడు నగర్‌లోని ఆయన నివాసం వద్ద భీష్మించుకు కూర్చుంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా, చావనైనా చస్తాను కానీ న్యాయం జరగకుండా కదిలేది లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనతో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొంది.
