సర్కారు సాయం లేకుంటే వొడాఫోన్ ఐడియా మనుగడ కష్టమే

సర్కారు సాయం లేకుంటే వొడాఫోన్ ఐడియా మనుగడ కష్టమే

సర్కార్ సాయం లేకుంటే ఇక అంతే సంగతులు
చేతులెత్తేసిన కుమార్ మంగళం బిర్లా
మనీ ఇన్వెస్ట్ చేయదలుచుకోలే..
రిలీఫ్ ప్యాకేజీలు కావాల్సిందే..

దేశంలోనే మూడో పెద్ద మొబైల్ సర్వీసు ప్రొవైడర్ అది. అయినా బాకీలు కట్టలేకపోతోంది. ఓ వైపు చౌక ధరలతో అంబానీ కంపెనీ జియో నుంచి వస్తోన్న పోటీని తట్టుకోలేక సతమతమవుతున్న ఈ కంపెనీకి, ఏజీఆర్‌‌‌‌ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌‌తో తల ప్రాణం తోకకు వచ్చినట్టైంది. ఇంక చేసేదేమీ లేక బాకీల చెల్లింపులో ప్రభుత్వం నుంచి కాస్త ఊరట కోరింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ప్రభుత్వం సాయం చేయకపోతే.. దుకాణం బంద్‌‌ చేస్తామంటూ ప్రకటించేసింది వొడాఫోన్ ఐడియా.

న్యూఢిల్లీ: అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యం లో… వొడాఫోన్ ఐడియా భారీగా రూ.53,038 కోట్ల మేర బాకీలను డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌ కు(డీఓటీకి) కట్టాల్సి వస్తోంది. ఈ బాకీల విషయంలో ప్రభుత్వం ఊరట ఇవ్వకపోతే, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌‌‌‌ను మూసి వేస్తామని ఆ కంపెనీ ఛైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా శుక్రవారం ప్రకటించారు. హిందూస్తాన్ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్ సమిట్‌‌‌‌లో పాల్గొన్న బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ మాకు కనుక ప్రభుత్వం నుంచి ఎలాంటి రిలీఫ్ రాకపోతే, వొడాఫోన్ ఐడియా స్టోరీ ఇక ఎండ్ అయినట్టేనని మేము భావిస్తున్నాం ’ అని బిర్లా అన్నారు. రూ.53,038 కోట్ల బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి ఊరట రాకపోతుండటంతో, వొడాఫోన్ ఐడియా భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చారు. వొడాఫోన్ ఐడియా మరింత మనీని ఇన్వెస్ట్ చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘చెడు జరిగిన తర్వాత కూడా మనీ పెట్టాలనుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. ఇక మా ప్రయాణానికి స్వస్తి చెబుతాం. మేము దుకాణం మూసి వేస్తాం’ అని అన్నారు.

జియో ధాటికి తట్టుకోలేక, గతేడాదే విలీనం
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆఫర్ చేసిన ఉచిత వాయిస్ కాలింగ్, చీప్ డేటాకు తట్టుకోలేకపోయిన బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్, బ్రిటీష్‌కు చెందిన టెలికాం కంపెనీ వొడాఫోన్ పీఎల్‌‌‌‌సీలు రెండూ గతేడాదే ఒకటిగా విలీనమయ్యాయి. విలీనం తర్వాత ఈ రెండు కంపెనీలకు కలిపి రూ.1.17 లక్షల కోట్లు అప్పులున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాకీలను ప్రొవిజనింగ్ చేశాక, కొన్ని వారాల క్రితమే ఇండియాలోనే అతిపెద్ద కార్పొరే ట్ నష్టాన్ని వొడాఫోన్ ఐడియా రిపోర్టు చేసింది. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు కలిసి టెలికాం లైసెన్స్ ఫీజులు,
స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు, వాటి వడ్డీలు, పెనాల్టీలు మొత్తంగా కలిపి 14 ఏళ్లలో రూ.1.47 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ బాకీలను మూడు నెలల్లోపే డీఓటీకి కట్టాలి. ఏజీఆర్ విషయంలో 14 ఏళ్ల తర్వాత డీఓటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏజీఆర్‌‌‌‌‌‌‌‌లో కొంత భాగాన్ని స్టాట్యుటరీ బకాయిలుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏజీఆర్ లెక్కింపులోనే ప్రభుత్వానికి, టెలికాం కంపెనీలకు ఇన్ని రోజులు వివాదం నడిచింది. నాన్ టెలికాం రెవెన్యూలు కూడా వ్యాపారాల్లో భాగమేనని ఇటీవలే సుప్రీం తీర్పునిచ్చింది.

ప్రపంచంలో ఏ కంపెనీ ఇంత జరిమానా కట్టలే…
ఈ విషయంలో భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియాలు వడ్డీలు, పెనాల్టీలు విషయంలో ప్రభుత్వం రిలీఫ్ ఇవ్వాలని కోరుతున్నాయి. అలాగే సుప్రీంకోర్ట్‌‌‌‌లోనే రివ్యూ పిటి షన్ కూడా వేశాయి. ఈ రిలీఫ్ కేవలం టెలికాం రంగానికే కాదు.. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ వృద్ధిని పైకి తేవడానికి కూడా ఉపయోగపడుతుందని బిర్లా పేర్కొన్నారు. టెలికాం చాలా కీలకమైన రంగమని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. మొత్తం డిజిటల్ ఇండియా ప్రొగ్రామ్‌‌‌‌ దీనిపైనే ఆధారపడిందని, ఇదే అతి ముఖ్యమైన రంగమని చెప్పారు. ప్రైవేట్ రంగం నుంచి మూడు కంపెనీలను, ప్రభుత్వ రంగ నుంచి ఒక కంపెనీని టెలికాం రంగంలో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్టు బిర్లా చెప్పారు. ఈ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం నుంచి మరింత ప్యాకేజీని తాము ఆశిస్తున్నామని తెలిపారు. అయితే ఎలాంటి ప్యాకేజీ రాకపోతే, వొడాఫోన్ ఐడియా స్టోరీ ఇక ఎండ్ అయిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. వొడాఫోన్ పీఎల్‌‌‌‌సీ సీఈవో నిక్ రీడ్ కూడా ఇటీవలే ఇలా అయితే ఇండియాలో మనుగడ అసాధ్యమని అన్నారు. ఒకవేళ తమపై ఎలాంటి జాలి చూపించకపోతే, లిక్విడేషన్‌‌‌‌కు వెళ్తామన్నారు. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా మూడు నెలల్లో ఇంత మొత్తంలో జరిమానాను చెల్లించలేదని బిర్లా పేర్కొన్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీం తీర్పుకు ముందే వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లను సేకరించింది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌, యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్‌‌‌‌ నుంచి రూ.17,920 కోట్లు వచ్చాయి. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌కు 27.66 శాతం, వొడాఫోన్‌‌‌‌కు 44.39 శాతం వాటాలున్నాయి.

పడిన షేర్లు…
బిర్లా ఈ కామెంట్స్ చేసిన వెంటనే వొడాఫోన్ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి. శుక్రవారం ట్రేడింగ్‌‌‌‌లో 8.5 శాతం తగ్గిన షేర్లు బీఎస్‌‌‌‌ఈలో రూ.6.69 వద్ద ట్రేడయ్యాయి. చివరికి బీఎస్‌‌‌‌ఈలో 5.34 శాతం నష్టంలో రూ.6.92 వద్ద క్లోజయ్యాయి. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో కూడా 5.48 శాతం నష్టపోయి రూ.6.90 వద్ద ముగిశాయి.