ఆ ఊళ్లలో అన్నీ డబుల్

ఆ ఊళ్లలో అన్నీ డబుల్

అక్కడ ఒక మనిషికి రెండు రేషన్ కార్డులు, రెండు ఓటరు కార్డులు ఉన్నాయి. రెండు రేషన్ షాపులు… ఒకే ఊరికి రెండు ప్రభుత్వ స్కూళ్లు కనిపిస్తాయి. ఒకే గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులు, ఒకే నియోజకవర్గాని కి ఇద్దరు ఎమ్మెల్యే లు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది మరెక్కడో కాదు… తెలంగాణ పరిధిలో ఉన్న పన్నెండు సరిహద్దు గ్రామాల్లో పరిస్ థితి. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదంతో కొన్నేళ్లుగా ఓటరు కార్డుతో సహా అన్నీ రెండు ఇస్తుండడం గమనార్హం .

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల పరిధిలో ఉన్న పన్నెండు గ్రామాలకు కలిపి ఇంతకుముందు రెండు గ్రామ పంచాయతీలు ఉండేవి. అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలకు సంబంధించి పరందోలి, అంతాపూర్ రెండు గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో ఒకే గ్రామపంచాయతీకి ఇద్దరు సర్పంచులు అయ్యారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ కాగా, మరొకరు మహారాష్ట్ర సర్పంచ్. ఇప్పుడు రెండు గ్రామ పంచాయతీలు కాస్త నాలుగయ్యాయి. పరందోలి, అంతాపూర్ , భోలాపటార్, ముకద్దమ్ గూడ గ్రామ పంచాయతీల పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో 4,277 జనాభా ఉండగా 2,663 మంది ఓటర్లు ఉన్నారు. ఈ వివాదాస్పద గ్రామాలు అటు మహారాష్ట్రలోని రాజుర అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోకి, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర గ్రామాల పరిస్థితి వేరు. ఇక్కడ ఉన్న పన్నెండు గ్రామాల పరిస్థితి వేరు. ఒకే ఇంట్ లో రెం డు రాష్ట్రాలకు చెందిన ఓట్లు ఉంటాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రం ఓటు. మరొకటి మహారాష్ట్ర ఓటు. రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు జరుగుతాయి. ఒకటి తెలుగు మీడియం స్కూల్ ఉంటే… మరొకటి మరాఠి మీడియం స్కూల్ ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చిన స్కూల్ లో వారు చదువుకోవచ్చు. ఇలా అన్ని ఇక్కడ డబుల్ ధమాకయే. వివాదం ఇప్పటిది కాదు ఈ పన్నెండు గ్రామాల సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. 1987లో ప్రారంభమైంది.

అప్పటి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర మధ్య సరిహద్దులు నిర్ణయించేందుకు కె.కె.నాయుడు కమిటీని డిసెం బరు1989లో కేంద్ర ప్రభుత్వం నియమించిం ది. మహారాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రాజుర ఎమ్మెల్యే ప్రభాకర్ మాహోల్కర్ , అప్పటి ఆంధ్ర అధికారులు కలసి సరిహద్దులు నిర్ణయించారు. 1990లో మహారాష్ట్ర  ప్రభుత్వం పరందోలిని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఇదే గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దింది. 1992లోనే ఈ వివాదాస్పద గ్రామాలకు రేషన్ కార్డులు అప్పటి ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు ఇచ్చారు. అప్పట్లో మహారాష్ట్రకు చెందిన అప్పటి ఎమ్మెల్యే వామన్ రావు చాటార్ మరాఠి భాష, సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు .

1996లో వివాదాస్పద పన్నెం డు గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వస్తాయని అప్పటి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని నిరసిస్తూ అప్పటి మహారాష్ట్ర ఎమ్మెల్యే వామన్ రావు, కలెక్టర్ ఆరుముగం సుప్రీం కోర్టుకెక్కారు . 1996 మార్చి 10న అప్పటి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ వివాదాస్పద గ్రామాల్లో అభిప్రాయ సేకరణకు రాజ్యసభ సభ్యులు కెఎం ఖాన్ వచ్చారు. ఆయన సమక్షంలో ఇరు రాష్ట్ర మద్దతుదారుల మధ్య ఘర్షణలు సైతం చెలరేగాయి. ఏప్రిల్ 1996లో సుప్రీంకోర్టు స్టే విధించింది. పన్నెండు వివాదాస్పద గ్రామాల సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు జరగాలని, అభివృద్ధి కూడా కొనసాగాలని ఆదేశించిం ది.

1996 పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు రావడంతో రెండు రాష్ట్రాల అధికారులు రెం డు వేర్వేరు పోలిం గ్ బూత్ లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు 60 శాతం ఓట్లు పోయ్యాయి.ఆంధ్రప్రదేశ్ కు మాత్రం 40 శాతం ఓట్లు పోయ్యాయి. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ఇక్కడ రెం డు ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధిం చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.  అందుకే ఒకే ఇంట్లో రెండు ఓటర్ కార్డులు, రెం డు రాష్ట్రాలకు చెందిన పింఛన్లు అందుతున్నా యి. ఈ నెల 11న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, మహారాష్ట్రల్లో వారికి ఇష్టం ఉన్నచోట గ్రామస్తులు ఓటు వేయనున్నారు . తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి.

2014 నుం చి ఏం అందలే..

తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి తమ గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కేసీఆర్ ఇచ్చిన రైతుబంధ పథకం కింద ఎకరానికి రూ. నాలుగు వేలు కూడా తమ గ్రామాలకు అందలేదని అంటున్నారు . 1992 నుంచి ప్రభుత్వం పహాణి నకల్ ఇవ్వడంతో రుణాలు తీసుకొని సాగు చేసేవారు. 2014 నుంచి పహాణి నకల్ నిలిపివేయడంతో రైతుబంధు పథకం అందక, బ్యాంకులు రుణాలు ఇవ్వక దళారులను ఆశ్రయించి సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వివాదాస్పద గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా యి. రోడ్డు రవాణా సౌకర్యం లేక సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.