పనికిపోతే ప్రాణాలు పోయాయి

పనికిపోతే ప్రాణాలు పోయాయి

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో  సోమవారం ఓ ప్రమాదంలో అన్నదమ్ములు చనిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. బెజ్జూరు మండలం ముంజంపల్లికి చెందిన అన్నదమ్ములు బుర్రి వసంత్(22), బుర్రి అనిల్ (20), మరో వ్యక్తి జంబుల శ్రీకాంత్ కాంట్రాక్టర్ కు చెందిన  కరెంటు స్తంభాలు, వైర్లు, ఇతర మెటీరియల్ తీసుకొని ట్రాక్టర్ లో వెళ్తున్నారు. గుడ్లబోరి పంచాయతీలోని వైగాం గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ లో కూర్చున  ముగ్గురూ  కిందపడ్డారు. వారిపై సామగ్రి పడింది. 

స్తంభాలు బలంగా పడడంతో  వసంత్, అనిల్​స్పాట్ లోనే చనిపోయారు. శ్రీకాంత్​కు  తీవ్రగాయాలవగా స్థానికులు అంబులెన్స్ లో కాగజ్ నగర్ కు తరలించారు.  సమాచారం అందడంతో  సీఐ సాధిక్ పాషా, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వెళ్లి డెడ్ బాడీలను సిర్పూర్ హాస్పిటల్ కు తరలించారు. మృతుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుల తండ్రి ప్రమాదవశాత్తూ చనిపోగా కుటుంబ భారం అన్నదమ్ములపై పడింది. దీంతో  ఇద్దరూ కూలీలుగా మారి తల్లి, చెల్లిని పోషిస్తున్నారు.  అనుకోని ఘటన జరగడంతో ఆ ఇంట్లో తీవ్రవిషాదం నెలకొంది.