
- బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్
జీడిమెట్ల, వెలుగు: జీవో నం.58,59 ద్వారా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రూ.2వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. నిజాంపేటలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా.. 58,59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న మొత్తం 12 సర్వే నంబర్లలోని భూములను సోమవారం ఆయన పరిశీలించారు.
ఇతర నేతలతో కలిసి అక్కడ ఆందోళన చేపట్టారు. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ భర్తతోపాటు కొందరు కార్పొరేటర్లు సుమారు రూ.2వేల కోట్ల విలువగల వెయ్యి ప్లాట్లను 58,59 జీవోల ద్వారా కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.