సీపీఐకి ఒక్క ఎంపీ సీటన్నా ఇవ్వాలి..కాంగ్రెస్​కు కూనంనేని విజ్ఞప్తి

సీపీఐకి ఒక్క ఎంపీ సీటన్నా ఇవ్వాలి..కాంగ్రెస్​కు కూనంనేని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటన్నా సీపీఐకి కాంగ్రెస్​ పార్టీ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.  బీజేపీని ఎదుర్కొనే క్రమంలో సీపీఎం, సీపీఐని కలుపుకొని పోవాలని సూచించారు. బీజేపీ అనుకున్నట్టుగా సీట్లు గెలిస్తే దేశంలోని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ప్రభుత్వాలను బతకనివ్వదని, చివరికి సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రమాదం తీసుకుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డితో కలిసి మీడియాతో కూనంనేని మాట్లాడారు. సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, కాంగ్రెస్ తో ఎన్నికల అవగాహన అంశంపై చర్చించినట్టు చెప్పారు. కాంగ్రెస్ సీట్లు సర్దుబాటుపై స్పష్టత వచ్చిన తర్వాతే, మరోసారి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

సీపీఐకి ఒక్కసీటూ ఇవ్వలేరా..? : నారాయణ

పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి రాష్ట్రంలో ఒక్క సీటూ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. సీపీఐ ..ఇండియా కూటమిలో భాగస్వామి అని,  అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పనిచేశామని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపుదారులకు అవకాశం ఇవ్వడంపై ఆయన ఎక్స్ లో వాపోయారు