వరంగల్ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ కోరారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దయాసాగర్ మాట్లాడుతూ ఏడాదిన్నర నుంచి జర్నలిస్టుల అక్రిడిటేషన్లు స్టిక్కర్లతో నడుస్తున్నాయని, వెంటనే కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీడబ్ల్యూజేఎఫ్ దీర్ఘకాలికంగా పనిచేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పొడేటి అశోక్, కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు అనంతుల రమేశ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, ఈర్ల సురేందర్, జిల్లా కోశాధికారి గాయపు రాజు రెడ్డి, జిల్లా నాయకులు కొమ్ము రాజు, విజయ్ భాస్కర్ రెడ్డి, సధిరం కుమార్, కుంటమల్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
