పేదరికం కలలకి అడ్డు కాదని నిరూపించింది

పేదరికం కలలకి అడ్డు కాదని నిరూపించింది

కుంజా రజిత. గొత్తికోయల తెగ కుటుంబంలో పుట్టింది. ఐదుగురు పిల్లల్లో ఆఖరిది. పుట్టుకతోనే పేదరికం వెంటాడినా ఎప్పుడూ బాధపడలేదు. తండ్రి కట్టెలమ్ముతూ సంపాదించేవాడు. చాలీచాలని సంపాదనే అయినా ఆ కుటుంబమంతా తృప్తిగా ఉండేది. అకస్మాత్తుగా తండ్రి మారయ్య చనిపోయారు. దాంతో ఐదుగురు పిల్లల భారం తల్లి భద్రమ్మపై పడింది. కట్టెలు అమ్మి పిల్లల కడుపు నింపేదామె. తను పస్తులుండి పిల్లలకి చదువు చెప్పించింది. ఆటల్లోనూ ప్రోత్సహించింది. ఆ తల్లి ప్రోత్సాహమే ఈ నెల 17న కెన్యాలో జరిగే 2021 వరల్డ్ అథ్లెటిక్స్ అండర్‍-20  ఛాంపియన్‍షిప్‍లో రజితకి పాల్గొనే అవకాశం వచ్చేలా చేసింది. పేదరికం కలలకి అడ్డు కాదని మరోసారి నిరూపించింది. 

పాతికేళ్ల  కిందట ఛత్తీస్‌‌గఢ్‌‌ నుంచి తూర్పుగోదావరిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురంకి వలస వచ్చింది రజిత కుటుంబం. చిన్నప్పట్నించీ పరుగు పందాలంటే భలే ఇష్టం ఆమెకి. చుట్టుపక్కల ఎక్కడ రన్నింగ్​ కాంపిటీషన్స్​ జరిగినా పక్కాగా ప్రైజ్​ పట్టుకొచ్చేది. అది గమనించిన పీఈటీ వంశీకృష్ణ ‘నెల్లూరు టెన్విక్ స్పోర్ట్స్ స్కూల్లో’  రజితని చేర్పించాడు. తొమ్మిది, పది క్లాసులు​ అక్కడే చదువుకుంది. ఒక పక్క చదువుతూనే రన్నింగ్‍లో ​ వంశీ సాయి కిరణ్‍ దగ్గర ట్రైనింగ్‍తీసుకుంది. ఆ తర్వాత మంగళగిరిలో ఇంటర్మీడియెట్‌‌ చదువుతూ మైకె రసూల్‌‌ దగ్గర ప్రాక్టీస్​ మొదలుపెట్టింది.  అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో  రజిత ట్రైనింగ్​కి కరోనా బ్రేకు​లు వేసింది. ఏం చేయాలో తెలియని స్థితిలో పాత కోచ్​ల సలహాతో హైదరాబాద్​లోని ‘శాయ్‍’ అథ్లెటిక్స్ కోచ్​ రమేష్‍  దగ్గర ట్రైనింగ్​ తీసుకోవాలి అనుకుంది రజిత. కానీ, ఆర్థిక పరిస్థితులు అడుగడుగునా కలలకి అడ్డు పడ్డాయి. రజిత పరిస్థితిని అర్థం చేసుకుని మ్యాథ్స్ టీచర్‍ నెలనెలా రూ.10వేలు డబ్బుసాయం చేశారు. పుల్లెల గోపీచంద్‍ నుంచి పాతిక వేల రూపాయల సాయం అందింది.‘గోపీ మైత్రా ఫౌండేషన్’ నుంచి కూడా ఆమెకు సాయం అందుతోంది. 

నీరజ్‍చోప్రా..హిమాదాస్​ ఆదర్శంగా  
టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్‍చోప్రా జావెలిన్‍త్రోలో  గోల్డ్ మెడల్ అందుకుంటున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు.  ఆ ప్రేరణతోనే నేనూ కెన్యాలోని నైరోబీలో గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మన దేశానికి ఎన్నో పతకాల్ని అందించిన హిమాదాస్‍ కూడా  నాకు మార్గదర్శి.  ఎందుకంటే ఆమె కూడా నాలాగే కష్టాల్లోనే పుట్టి, పెరిగింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా  తన లక్ష్యాన్ని చేరుకుంది. - రజిత

పీటీ ఉష ప్యానెల్​
 అస్సాంలో 2019లో జరిగిన ఖేలిండియా అథ్లెటిక్స్‌ పోటీల్లో రజిత 4×400 మీటర్లలో సిల్వర్‍ మెడల్​ గెలుచుకుంది. అక్కడే పీటీ ఉష సెలక్షన్స్ కమిటీ ప్యానెల్  దృష్టిలో పడింది ఆమె పరుగు. ఈ నెల 17న జరిగే అండర్‍-20 వరల్డ్ అథ్లెటిక్స్​ సెలక్షన్స్​కి బాటలు వేసింది. కెన్యాలోని నైరోబిలో  జరగబోయే ఈ పోటీల కోసం పాటియాలా క్యాంపులో ట్రైనింగ్​ తీసుకుంది రజిత.                - మొబగాపు ఆనంద్‌కుమార్‌‌, భద్రాచలం,వెలుగు