- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు
- ప్రాణాలు కోల్పోయిన మూడు కుటుంబాలకు చెందిన 8 మంది
- ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
- కర్నూలు జిల్లా చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
- ఇద్దరు డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులతో బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు
- బస్సు ముందు భాగంలో ఇరుక్కున్న బైక్.. పెట్రోల్ లీక్ కావడంతో మంటలు
- డ్రైవర్ వెనకున్న చిన్న అద్దం పగులగొట్టి బయటపడిన నలుగురు ప్రయాణికులు
- వాళ్లు బస్సు వెనకున్న అద్దాన్ని పగులగొట్టడంతో బయటకు దూకిన మరో 21 మంది
- ఈలోగా బస్సు అంతటా వ్యాపించిన మంటలు.. కొంతమంది నిద్రలోనే సజీవ దహనం
- మాంసపు ముద్దల్లా మారిన డెడ్‌బాడీలు.. స్పాట్‌లోనే పోస్ట్‌మార్టం
- చనిపోయినోళ్లలో ఆరుగురు చొప్పున తెలంగాణ, ఏపీ వాసులు..
- మిగిలినోళ్లలో కర్నాటక, తమిళనాడు, బిహార్, ఒడిశా వాళ్లు
- డీఎన్ఏ రిపోర్టులు వచ్చాక మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత
- బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయిన బైకర్ కర్నూలు వాసి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బస్సు బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు చిన్నారులు సహా మొత్తం 46 మంది ఉన్నారు. లోపల దట్టమైన పొగ వ్యాపించడం, హైడ్రాలిక్ డోర్ తెరుచుకోకపోవడంతో అశ్విన్‌రెడ్డి అనే ప్రయాణికుడు డ్రైవర్‌సీటు వెనుకాల ఉన్న చిన్న మిర్రర్ పగులగొట్టుకొని బయటకువచ్చాడు. ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులు బస్సు వెనుక ఉన్న అద్దాన్ని పగుల గొట్టడంతో అందులోంచి మరో 21 మంది దూకారు. కానీ బస్సు ముందు భాగంలో ఉన్నవారంతా బయటకు రాలేక, మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు ఉండగా.. ఏపీకి చెందిన ఆరుగురు, కర్నాటక, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు.
మిగిలిన ముగ్గురిలో ఒకరిది బిహార్, ఒకరిది ఒడిశా కాగా.. మరొకరిది ఏ రాష్ట్రమో గుర్తించాల్సి ఉంది. రాత్రి 9:30 గంటలకు పటాన్‌చెరు నుంచి బయలుదేరిన బస్సు ఆరాంఘర్ మీదుగా బెంగళూర్ రూట్‌లో ప్రవేశించింది. ప్రయాణికుల కోరిక మేరకు మధ్యలో ఒకచోట బస్సు ఆపారు. ఆ తర్వాత రాత్రి 2:30 నుంచి 3 గంటల మధ్య బస్సు కర్నూల్ జిల్లా ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో 100కు పైగా స్పీడ్‌తో వెళ్తున్న బస్సు.. దాని ముందు వెళ్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న కర్నూల్ వాసి శివశంకర్ అమాంతం డివైడర్ పైకి ఎగిరిపడి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలోనే బస్సు ముందు భాగంలో బైకు ఇరుక్కోగా, దాన్ని దాదాపు 300 మీటర్ల దూరంఈడ్చుకెళ్లింది. సరిగ్గా అప్పుడే నిప్పు రవ్వలు చెలరేగడం, బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ బస్సును ఆపి, మరో డ్రైవర్‌ను నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్స్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో బస్సు ముందుభాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మృతుల్లో మూడు కుటుంబాలకు చెందిన 8 మంది
బస్సు ముందు భాగంలో అప్పర్ బెర్త్‌లో నిద్రిస్తున్న నెల్లూరు జిల్లా గొళ్లవారిపల్లికి చెందిన రమేశ్, ఆయన భార్య అనూష, కుమారుడు శంశాంక్, కూతురు మన్వత నిద్రలోనే సజీవ దహనమయ్యారు. వీరితో పాటు లోయర్ బెర్త్‌లో నిద్రిస్తున్న మెదక్ జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు సంధ్యారాణి, చందన, కర్నాటకకు చెందిన ఫిలోమెన్ బేబి, ఆమె కుమారుడు కిశోర్ బాబు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరో 11 మంది ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. బస్సు కాలిపోతున్న సమయంలో అటు బెంగళూర్ వైపు, ఇటు హైదరాబాద్ వైపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటిలోంచి బయటకు వచ్చిన కొందరు వాహనదారులు బస్సు లోపల ఉన్న ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. గాయాలతో ఉన్న వారిని తమ వాహనాల్లో దగ్గరలోని హాస్పిటల్స్‌కు తరలించారు.
స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కర్నూల్ ఎస్పీ విక్రాంత్ సహా స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డెడ్‌బాడీలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడానికి వీలులేకుండా ఉన్నాయి.
దీంతో ఫోరెన్సిక్ నిపుణులతో మృతదేహాలను బయటకు తీశారు. కర్నూల్ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో స్పాట్‌లోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత కర్నూల్ఆసుపత్రికి తరలించారు. డీఎన్ఏ టెస్టులు నిర్వహించాకే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. కాగా, ఘటనా స్థలానికి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వచ్చి పరిశీలించారు.
బస్సులో మొత్తం 46 మంది..
వేమూరి కావేరి ట్రావెల్స్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, పటాన్‌చెరు నుంచి హైదరాబాద్, బెంగళూరు మధ్య వోల్వో బస్సులు నడుపుతున్నది. ఇందులో వోల్వో మల్టీ ఆక్సెల్ ఏసీ స్లీపర్ బస్సు (నంబర్ డీడీ 01 ఎన్ 9490)లో బెంగళూరు వెళ్లేందుకు నలుగురు చిన్నారులు సహా మొత్తం 44 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. గురువారం రాత్రి 9.30 గంటలకు పటాన్‌చెరు నుంచి బస్సు ప్రారంభమైంది. అంతకుముందు బీరంగూడ, గండిమైసమ్మ, బహదూర్ పల్లి క్రాస్ రోడ్స్, సూరారం, మియాపూర్ అల్విన్ క్రాస్ రోడ్స్ సహా వివిధ పాయింట్ల నుంచి ప్రయాణికులను పికప్ చేసుకున్నారు. డ్రైవర్లు మిర్యాల లక్ష్మయ్య, గుడిపాటి శివనారాయణతో పాటు 43 మంది ప్రయాణికులతో బస్సు ఆరాంఘర్‌కు చేరుకుంది. అక్కడ మరో ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. అందులో నుంచి ఒకరు దిగిపోయారు. ఇలా మొత్తం 46 మందితో బస్సు బెంగళూరుకు బయలుదేరింది.
డోర్‌లాక్ ఓపెన్ చేయకుండానే డ్రైవర్లు పరార్
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడానికి హైడ్రాలిక్ డోర్‌తో పాటు బస్సు మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్డోరే ఆధారం. కానీ మంటలను ఆర్పేందుకు బస్సులోంచి బయటకు దిగిన డ్రైవర్లు ఇద్దరూ హైడ్రాలిక్ డోర్ తెరవలేదు. కనీసం బయట నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరిచే ప్రయత్నం చేయలేదు. అప్పటికే బైక్ పెట్రోల్‌తో మంటలు వ్యాపించడంతో పాటు బస్సు డీజీల్ ట్యాంక్ కేబుల్స్ కూడా తెగిపోవడంతో డీజీల్, పెట్రోల్ కలిసి తీవ్రస్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. లోపలంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వారిలో చాలా మంది అలర్ట్‌గా లేకపోవడం, దట్టమైన పొగకు తోడు చిమ్మచీకటితో షాక్‌కు గురయ్యారు. బస్సు బైక్‌ను ఢీకొట్టిన సమయంలో భారీ శబ్దం రావడంతో లోయర్ బెర్త్‌లో నిద్రిస్తున్న కొంతమంది నిద్రలేచారు.
ఏం జరిగిందో తెలుసుకునేలోగా ముందు వైపు భారీగా మంటలు ఎగిసిపడడంతో హాహాకారాలు చేస్తూ కొందరు వెనుక వైపునకు పరిగెత్తారు. కానీ ఎలాంటి హ్యామర్లేకపోవడంతో వెనుక వైపు అద్దాన్ని పగలగొట్టడం సాధ్యం కాలేదు. ఆలోగా అశ్విన్‌రెడ్డి అనే ప్రయాణికుడు డ్రైవర్‌సీటు వెనుకాల ఉన్న చిన్నమిర్రర్పగుల గొట్టుకొని బయటకువచ్చాడు. ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులు కలిసి బస్సు వెనుక అద్దాన్ని పగుల గొట్టడంతో అందులోంచి మరో 21 మంది దూకారు. ఈలోగా అప్పర్, లోయర్ బెర్త్ కర్టెన్లు, బెడ్‌షీట్లు, మ్యాట్రిస్ఒక్కసారిగా అంటుకోవడంతో మిగిలినవారు బయటపడే చాన్స్‌లేకుండా పోయింది. ముఖ్యంగా ముందువైపు అప్పర్, లోయర్బెర్త్లలో షాక్‌లో ఉండిపోయినవారు ఎక్కడివారక్కడే సజీవ దహనమయ్యారు.
