
కర్నూల్ జిల్లా ఆదోని లో బుధవారం మధ్యాహ్నం జరిగిన పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ కుంటే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నందన్న కారణంగానే యువతి(మహేశ్వరి) కుటుంబ సభ్యులు అతన్ని దారుణంగా చంపారు. ఈ విషయంపై మహేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన భర్త ఆడమ్ స్మిత్‌ను తన తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నలు కలిసి చంపారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త చనిపోయినప్పటికీ తాను మాత్రం అత్త మామలవద్దే ఉంటానని ఆమె స్పష్టం చేసింది.
తాము ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అయితే చదువులు పూర్తయి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నామని చెప్పింది. ఆడమ్ స్మిత్‌కు ఉద్యోగం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నామని, వివాహం అయినప్పటి నుంచి తన భర్త మంచిగా చూసుకున్నారని ఆమె తెలిపింది. ఈ వివాహం ఇష్టం లేని తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని పోలీసులను కోరామని, తమ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని ఆమె చెప్పింది. అయినా దూరంగా ఉందామనే ఉద్దేశంతో ఆదోనిలో ఉంటున్నా… తమకు ఫోన్లు చేసి బెదిరించారని తెలిపింది. అయినా తన కుటుంబసభ్యులు విడిచిపెట్టలేదని తన భర్తను దారుణంగా చంపారని.. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించకూడదా? అంటూ కన్నీటిపర్యంతమైంది మహేశ్వరి . తన భర్తను ఎలాగూ చంపారు. ఒంటరిగా జీవించలేనని, తనని కూడా చంపేయాలని తండ్రిని కోరింది. తాను అత్త మామలతో కలిసి ఊరిలో ఉన్నా బతకనీయరని, వారికి కూడా ప్రాణహానీ ఉందని మహేశ్వరి వాపోయింది.