రైతుల కోసం వైఎస్ ఎంతో పోరాడారు : దిగ్విజయ్ సింగ్

రైతుల కోసం వైఎస్ ఎంతో పోరాడారు  : దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్, వెలుగు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొండివారని, నిజాయతీపరుడని సీడబ్ల్యూసీ మెంబర్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ‘‘వైఎస్ కేవలం రాజకీయ నాయకుడే కాదు. ఓ వ్యూహకర్త. పేదలు, మైనారిటీలు, రైతులు, స్టూడెంట్లు, మహిళలు, అణగారిన వర్గాలకు స్నేహితుడు” అని కొనియాడారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీడబ్ల్యూసీ మెంబర్​రఘువీరా రెడ్డి కలిసి వైఎస్​పై రాసిన ‘రైతే రాజైతే’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్​లోని ఓ హోటల్ లో దిగ్విజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘రైతుల కోసం వైఎస్​ఎంతో పోరాడారు. పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, మైనారిటీలకు అనుకూలంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల కోసం  స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. స్టూడెంట్లకు  ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం తెచ్చారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది” అని కొనియాడారు. వైఎస్ నాయకత్వమే పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ఆ నాయకత్వం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. వైఎస్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. . 

నాయకులందరికీ వైఎస్ ఆదర్శం: రేవంత్​

ఇప్పటి పాలనతో పోలిస్తే, వైఎస్ పాలనే చాలా గొప్పదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి, మళ్లీ వైఎస్ సంక్షేమ పాలనను అందిస్తామని చెప్పారు. వైఎస్ రాజకీయ నాయకులందరికీ ఆదర్శమని అన్నారు. వైఎస్​ను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నామని,  అరుదైన నాయకుడని భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ ​రాజశేఖర్​రెడ్డిది శ్రీకృష్ణ దేవరాయల లాంటి పాలన అని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ హయాంలో మంత్రిగా పని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు.

నన్ను తెలంగాణవాడిగా గుర్తించండి: కేవీపీ

తాను ఆంధ్రవాడిని కాదని, ఏపీని వదిలేసి 40 ఏండ్లయిందని కేవీపీ రామచంద్రరావు అన్నారు. తనను తెలంగాణవాడిగానే గుర్తించాలని, ఇక్కడి మట్టిలోనే కలిసిపోతానని చెప్పారు. ‘‘నా భార్య బిడ్డలతో ఇక్కడే ఉంటున్నా. వారిమీద ఒట్టేసి చెప్తున్నా. కనీసం సగం తెలంగాణవాడిగానైనా గుర్తించండి” అని అన్నారు. రేవంత్‌ను చూస్తుంటే.. వైఎస్ తరహాలోనే ప్రభుత్వాన్ని తీసుకొస్తారని అనిపిస్తోందన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని పాదయాత్ర చేశారని భట్టికి ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్​ బి.సుదర్శన్​రెడ్డి, ఉత్తమ్, మధుయాష్కీ,  జీవన్ రెడ్డి, అంజన్​కుమార్​యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నారాయణ పాల్గొన్నారు.