
- ఆందోళనకు దిగిన ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు
బషీర్బాగ్, వెలుగు: తమకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం హైదరాబాద్ కోఠి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్రటరీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గతేడాది 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని.. అందులో మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేశారని వారు తెలిపారు. కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
వైద్య సంచాలకుల కార్యాలయంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2న ఫైనల్ లిస్టు విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి తెలిపారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెరిఫికేషన్ పూర్తి చేసి నెల రోజుల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు.