- వేరే పనులకు డైవర్ట్ అవుతున్న స్థానికులు
- ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మేల్ లేబర్
- అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న కూలీలు
- ఇబ్బంది పడుతున్న రైతులు
పెద్దపల్లి, వెలుగు : యాసంగి సాగుకు కూలీల కొరత రైతులను ఇబ్బందికి గురి చేస్తుంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో వ్యవసాయ కూలీలు వివిధ పనులకు డైవర్ట్అవుతున్నారు. వ్యవసాయంలో రైతు కూలీలకు కేవలం నాట్లు వేయడం, పత్తి ఏరడం టైంలోనే పనులు ఉంటున్నాయి. మిగతా కాలం పనులు లేకపోవడంతో కూలీలు వ్యవసాయ పనులకు ఆసక్తి చూపడం లేదు.
అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన పురుషులు నాట్లు వేయడానికి వస్తున్నారు. వారు రోజువారి కూలీ కాకుండా పది మంది జట్టుగా చేరి ఎకరం మొత్తం గుత్తకు తీసుకొని ఒకేరోజు నాట్లు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎకరానికి రూ.5 వేల వరకు డిమాండ్చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
యాంత్రీకరణతో..
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేక చాలా మంది సమీప పట్టణాల్లో ఏదో ఒక పని చూసుకొంటున్నారు. వ్యవసాయం చేసే రైతులు స్థానిక రైతు కూలీలను కేవలం ఖరీఫ్, రబీలో నాట్లు వేయడానికి మాత్రమే పిలుస్తున్నారు. ఆ తర్వాత దాదాపు 9 నెలల వరకు ఎలాంటి పనులు ఉండటం లేదు.
గతంలో వ్యవసాయంలో దుక్కి దున్నడం నుంచి ధాన్యం చేతికొచ్చే వరకు వ్యవసాయ కూలీలకు పనులు దొరికేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో చాలా మంది రైతు కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు..
ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్నుంచి తెలంగాణకు కూలీలు వస్తున్నారు. వీరంతా ఎక్కువగా భవన నిర్మాణాలు, ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారు. కానీ ఇటీవల వీరు వ్యవసాయ కూలీలుగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా మగ కూలీలు నాట్లు వేయడంలో కన్పిస్తున్నారు. పది మంది ఒక జట్టుగా ఏర్పడి ఎకరాలు గుత్తకు తీసుకొని ఒకే రోజు దాదాపు మూడు ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు.
దీంతో వీరికి రోజుకు రూ.1200 నుంచి రూ.1500 కూలీ పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అధికంగా కూలీ డిమాండ్ చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనుకున్న టైంకు నాట్లు పడాలి కాబట్టి తప్పని స్థితిలో రైతులు డబ్బులు ఎక్కువైనా మేల్ లేబర్తో నాట్లు వేయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.
