
- జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవంలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్‌సిటీ/దిల్‌సుఖ్‌నగర్, వెలుగు: కార్మికుల ఆరోగ్యమే దేశాభివృద్ధికి బలమైన ఆధారమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో వృత్తిపరమైన అనారోగ్యాన్ని ముందే గుర్తించి నివారించడంపై దృష్టి పెట్టాల్సిఈన అవసరం ఉందన్నారు. జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కేర్ హాస్పిటల్స్, ఐఏఓహెచ్ అనుబంధ శాఖ అసోసియేషన్ ఫర్ ఆక్యుపేషనల్ హెల్త్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కలిసి “ఆక్యుమెడ్” కార్యక్రమాన్ని నిర్వహించాయి.
దీనికి మంత్రి వివేక్‌వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘ఆక్యుమెడ్’ వంటి కార్యక్రమాలు కార్మికుల ఆరోగ్య అవసరాలు, అందుబాటులో ఉన్న వైద్య సేవల మధ్య ఉన్న ఖాళీని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. ఇవి ఆరోగ్యకరమైన, సురక్షితమైన పని స్థలాలను రూపొందించడంలో కీలకంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్యుపేషనల్ హెల్త్ అంశంపై చర్చజరిగింది.
ఆరోగ్య రంగ నిపుణులు, కార్పొరేట్ సంస్థల వైద్యులు పాల్గొని.. ఆఫీసుల్లో కలిగే అనారోగ్య సమస్యలు, వాటి నివారణ మార్గాలు, ఆధునిక వైద్య సేవల ప్రాముఖ్యతపై చర్చించారు. ఏఓహెచ్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ పీఆర్ నందకిషోర్ మాట్లాడుతూ.. ‘ఆక్యుమెడ్ ఒక మంచి వేదిక. కార్పొరేట్ హెల్త్ ప్రాక్టీషనర్లు, క్లినికల్ నిపుణులు కలిసి ఆధునిక వైద్య విజ్ఞానాన్ని పంచుకొని, సహకారంతో ముందుకుసాగుతారు” అని చెప్పారు.
కేర్ హాస్పిటల్స్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ మాట్లాడుతూ.. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల ఆరోగ్యం చాలా కీలకంగా మారిందన్నారు. ఆక్యుమెడ్ ఆ దిశగా పని చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కాళోజీ వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి, 70 మందికి పైగా సీనియర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
కర్మన్‌ఘాట్ ఆలయంలో మొక్కులు..
ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం వివేక్, సరోజ దంపతులు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వివేక్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్.లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.