అప్పు పుడితేనే.. పథకాలకు పైసలు

అప్పు పుడితేనే.. పథకాలకు పైసలు
  • పథకాలకు పైసలు ఆగిపోయిన రైతుబంధు, దళిత బంధు, 
  • స్కాలర్ షిప్స్, కల్యాణ లక్ష్మి వంటి స్కీంలు
  • రెండు నెలలుగా లబ్ధిదారులకు రూ.15 వేల కోట్లు బకాయి 
  • కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.30 వేలు కోట్లు
  • పంచాయితీ రాజ్​కు రూ.1,250 కోట్లు పెండింగ్​
  • బీఆర్వోలు ఇస్తూ నిధులు మాత్రం విడుదల చేయని సర్కారు 

హైదరాబాద్, వెలుగు: ఏ నెలకానెల అప్పు పుడితేనే జీతాలు, పింఛన్లు. కొత్త అప్పు తేనిదే ఒక్క రోజు కూడా గడిచే పరిస్థితి లేదు. స్కీములకు చిల్లిగవ్వ లేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు లేవు. మొత్తంగా మూడు నెలలుగా రాష్ట్ర ఖజానా నుంచి పైసా విదిల్చడం లేదు. అప్పు వస్తేనే నిధులు సర్దుబాటు అవుతాయని అప్పటిదాకా పైసలు ఇవ్వలేమని వివిధ శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ తేల్చిచెబుతున్నది. మంగళవారం ఆర్ బీఐ నిర్వహించిన బాండ్ల వేలంపాటలోనూ తెలంగాణకు చోటు దక్కలేదు. దీంతో పథకాలకు నిధులు ఎట్లా ఇవ్వాలా అని ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నరు. అప్పు పుట్టకపోవడంతో రైతుబంధు, దళితబంధు, కళ్యాణ లక్ష్మితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ ల డిపార్ట్​మెంట్లు అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. గడిచిన రెండున్నర నెలల్లోనే వివిధ స్కీముల కింద లబ్ధిదారులకు చేరాల్సినవి రూ.15 వేల కోట్లు. అయితే తమ తప్పేమీ లేదన్నట్టు సర్కారు మాత్రం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్​వో)లు ఇచ్చి చేతులు దుపులుకుంటోంది. ఖజానా నుంచి మాత్రం పైసా రిలీజ్​చేయడం లేదు. ఇవి కాకుండా సుమారు రూ.30 వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయి.

దళిత బంధుకు రూ.17వేల కోట్ల బీఆర్వోలు

2నెలలుగా సర్కారు వివిధ స్కీమ్​లకు బడ్జెట్​రిలీజ్​ఆర్డర్లు ఇవ్వడమే తప్ప.. వాటికి నిధులు రిలీజ్ చే యడం లేదు. దళితబంధు కోసం నెల రోజుల కింద రూ.17,700 కోట్లకు బీఆర్వో ఇచ్చారు. ఎస్సీ డెవలప్​మెంట్ శాఖ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్​కూడా ఇచ్చేవారు. కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదు. స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం రూ.2,200 కోట్లకు బీఆర్వో ఇచ్చారు. వీటిని కూడా చెల్లించలేదు. ఏప్రిల్​20న కల్యాణ లక్ష్మి కోసం రూ.1,850 కోట్లు బీఆర్వో ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో చెక్కులు ఇవ్వలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. లక్షన్నర మంది దరఖాస్తు దారులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం చూస్తున్నారు. రైతు బంధుకూ రూ.7,400 కోట్లకు ఫైనాన్స్​నుంచి బీఆర్వో ఇచ్చినట్లు తెలుస్తున్నది. ప్రతి ఏడాది వానాకాలం సీజన్ లో జూన్ 15వ తేదీలోపే మొదలుపెట్టిన రైతుబంధుపై ఈసారి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. అప్పు పుట్టాకే మొదలుపెట్టనున్నట్లు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఆపీసర్లు చెప్తున్నారు. 5 ఎకరాలలోపు రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయాలన్నా.. కనీసం రూ.5 వేల కోట్ల దాకా అవసరం పడనున్నాయి. అప్పు తీసుకుంటే కానీ.. సర్దుబాటు చేసేందుకు అవకాశం లేదని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కింద రూ.203 కోట్లకు మే నెలలోనే బీఆర్వో ఇవ్వగా..ఈ నిధులు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో జమ కాలేదు. నేతన్నలకు వివిధ స్కీంల కోసం రూ.60 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్​ఇచ్చారు. నిధులిచ్చుడు మాత్రం షురూ కాలేదు.

ఇరిగేషన్​లో రూ.18వేల కోట్ల పెండింగ్​

సర్కారు చెల్లించాల్సిన బిల్లుల్లో అత్యధికంగా ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌వే రూ.18 వేల కోట్లు. నాలుగు నెలలుగా ఒక్క కాంట్రాక్టర్​కు కూడా బిల్లు క్లియర్ చేయలేదని సమాచారం. మరోవైపు ప్రాజెక్టులు, మిషన్‌‌‌‌‌‌‌‌ కాకతీయలో భాగంగా చెరువుల విస్తరణ, కాల్వల కోసం సేకరించిన భూములకు మూడు, నాలుగు ఏండ్ల నుంచి పరిహారం చెల్లించడం లేదు. మైనర్ ఇరిగేషన్​లో పనులు చేసిన కాంట్రాక్టర్లకూ బిల్లుల బకాయి బాగానే ఉంది. మిషన్ భగీరథ ట్యాంకులు (ఓహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌), పైపులైన్లు వేసిన చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు భారీగానే ఉన్నాయి. ఈ పనులను దాదాపు రూ.1,700 కోట్లకు దక్కించుకున్న వర్క్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి పనులు చేయించింది. ఇప్పుడు వీళ్లంతా సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ (పబ్లిక్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌) శాఖ, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ బిల్లులు రూ.4,150 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీల పనులతోపాటు మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణ పనులకు చాలా కాలంగా బిల్లులు చెల్లించడం లేదు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో నాలాలు, డ్రైనేజీల్లో పూడికతీత, రోడ్ల మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌  పనులకు బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఇక ఆర్ అండ్ బీలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం, సెక్రటేరియెట్​తో పాటు రోడ్లు ఇతర పనులకు రూ.3,500 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. పంచాయతీరాజ్ డిపార్ట్​మెంట్​లో రూ.1,250 కోట్లు, ఇతర డిపార్ట్​మెంట్లు కలిపితే ఇంకో రూ.2,300 కోట్లు పెండింగ్ ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇలా అన్నీ కలిపితే రూ.30 వేల కోట్లు దాటుతున్నాయి.

ఇటీవలి అప్పు జీతాలు, పింఛన్లకే

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4వేల కోట్ల తాత్కాలిక అప్పు పుట్టింది. అది కూడా ఆర్బీఐ ఈ నెలలో 7న అడ్​హాక్ విధానంలో సర్దుబాటు చేసింది. ఇందులో అధికభాగం జీతాలు, పింఛన్లకే వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతినెలా యావరేజ్​గా రూ.18 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏప్రిల్​లో రూ.9,455 కోట్లు, మే నెలలో రూ.11,010 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లెక్కన చూస్తే రూ.15,535 కోట్లు ఆగిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు రూ.4,700 కోట్లు అవసరం. రాష్ట్ర ఆదాయం మాత్రం రూ.12 వేల కోట్లు దాటడం లేదు. దీంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమైన రెండున్నర నెలల్లోనే స్కీములన్నీ పడకేశాయి.