వానలు పడకుంటే ఖజానాకు కష్టమే

వానలు పడకుంటే ఖజానాకు కష్టమే
  • దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..వర్షాలు తగ్గితే నష్టమే
  • పంటలు మంచిగ పండితే ధరలూ తక్కువ..
  • కంపెనీల షేర్లు పెరిగి అందరికీ లాభాలు
  • ఆర్బీఐ ‘రేట్ ’ డిసైడ్ చేసేదీ పంటల ఆధారంగానే
  • ప్రధాని నరేంద్ర మోడీకీ నైరుతి రుతుపవనాలు కీలకం
  • ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని

నైరుతి మబ్బులు లేట్ అయినయ్ . కొద్ది రోజుల్లో అన్ని చోట్లకూ పోతయిలే అనుకున్నం . కానీ, ‘వాయు’ వచ్చి ఆ మబ్బులల్ల ఉన్న తడిని గుంజేసుకుంది. ఆ తుఫాను అయితే జోరుగ ఉరికింది గానీ, ఆ మబ్బుల్ని కదలకుండా చేసింది. ఫలితం దేశం మొత్తం గొంతెండి తాగే నీళ్ల కోసమూ అల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. విత్తు కోసం దుక్కి సిద్ధం చేసుకున్న రైతుకూ గోస మిగిల్చింది. ఆ గోసే దేశ పైసల ఖజానా పైనా పెను ప్రభావం చూపించబోతోంది.

ముంబై: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళకు రావడం, వచ్చినా విస్తరించకపోవడంతో దేశంలో ఎక్కడా పెద్ద వర్షాలు పడలేదు. దీంతో ఇప్పటిదాకా జూన్​లో కురవాల్సిన వర్షం కన్నా 44 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో అటు యాసంగి పంటలూ పండక, ఇటు ఖరీఫ్​ సీజన్​ ఇంకా మొదలవకపోవడంతో పంట దిగుబడులు ఈ ఏడాది తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాదు, ఈ ఏడాది కరువు కాటకాలు మరింత పెరగొచ్చన్న ఆందోళనలూ వెల్లువెత్తుతున్నాయి. వర్షపాతం తక్కువ ఉండడం వల్ల వినియోగదారుల డిమాండ్​పై పెను ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది వర్షాలు మామూలుగానే పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చెప్పింది. ప్రైవేట్​ సంస్థ స్కైమెట్​ మాత్రం మామూలు కన్నా తక్కువగానే కురుస్తాయని చెప్పింది. ఎప్పుడూ జూన్​ నాటికి దేశంలో సగానికిపైగా ప్రాంతాల్లో నైరుతి విస్తరిస్తుంది. ఇప్పుడు వాయు తుఫాను ప్రభావంతో పావు వంతు భాగం కూడా వెళ్లలేదు. అదే వర్షపాతంపై ఆందోళన కలిగిస్తోంది.

తగ్గినా కష్టమే.. పెరిగినా నష్టమే

50 ఏళ్ల సగటు వర్షాల్లో 96 శాతం నుంచి 104 శాతం వర్షాలు కురిస్తే దానినే సాధారణ/మామూలు లేదా సగటు వర్షపాతం అని అంటారు. అంటే జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు నాలుగు నెలల కాలంలో సగటున 89 సెంటీమీటర్ల వర్షం కురవాలి. 90 శాతం కన్నా తక్కువ కురిస్తే లోటు వర్షపాతం అంటారు. గత ఏడాది వర్షాలు 9 శాతం తక్కువే కురిశాయి. కొన్ని చోట్ల అయితే 37 శాతం లోటు నమోదైంది. 110 శాతం కన్నా ఎక్కువ వర్షాలు కురిస్తే దానిని అధిక వర్షపాతంగా పిలుస్తారు. దీని వల్లా సమస్యే. ఎందుకంటే వరదలొచ్చి పంటల దిగుబడిని తగ్గించేస్తాయి మరి. సాధారణ వర్షపాతం వస్తే ఫర్వాలేదు.. కానీ, దానికన్నా తగ్గినా, దానికి మించి భారీగా పడినా నష్టాలే మిగులుతాయి. ఇప్పుడు నైరుతి లేట్​ అవడంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, వాతావరణ నిపుణులు మాత్రం, గతంలోనూ ఇలా లేట్​గా వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైందన్న విషయాలను గుర్తు చేస్తున్నారు. 2016లోనూ జూన్​ 8నే నైరుతి రుతుపవనాలు కేరళ గడప తొక్కినా జూలై 13 నాటికి దేశం మొత్తం వ్యాపించాయని, సాధారణ వర్షపాతం నమోదైందని అంటున్నారు.

ఆ 70% వర్షపాతమే డిసైడ్​ చేసేది

దేశంలో కురిసే వర్షాల్లో నైరుతి వాటానే 70 శాతం. అంటే, ఈ టైంలో వేసే ప్రధాన పంటలైన వరి, గోధుమ, చెరుకు, నూనె విత్తనాలు (వేరుశనగ, సోయా, సన్​ఫ్లవర్​ వంటివి), పత్తి దిగుబడులను డిసైడ్​ చేసేది ఈ వర్షాలే. 2.5 లక్షల కోట్ల డాలర్ల (₹1.74 కోట్ల కోట్లు) దేశ ఆర్థిక వ్యవస్థలో 15% వాటా కలిగిన వ్యవసాయమే.. సగం జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. వర్షాలు మంచిగా కురిసి పంటలు బాగా పండితే గ్రామీణ ప్రాంతాల్లో సరుకులకు మంచి డిమాండ్​ ఉంటుంది. ఆ గ్రామాల్లో అమ్మే ఉత్పత్తులే చాలా కంపెనీల స్టాక్​ ప్రైస్​ (షేర్​ ధర) పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. అక్కడ వ్యాపారం బాగా సాగితే కంపెనీ షేర్​ ధర పెరుగుతుంది. లేదంటే పడిపోతుంది. దాని వల్ల ఇన్వెస్టర్లు లాభపడడమో లేదంటే నష్టపోవడమో జరుగుతుంది. ఇటు, కంపెనీలకూ నష్టం కలుగుతుంది. అంతేకాదు, వరి, గోధుమ పంటలు మనకు సరిపడా ఉన్నాయి. కానీ, వర్షాలు రాక కరువు ఏర్పడితే మాత్రం పప్పులు, నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దాని వల్ల దిగుమతి సుంకాలు పెరిగి అటు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. ఇటు ఆహార ధరలూ పెరుగుతాయి. వర్షాలు మంచిగా పడి డ్యాములు నిండితే కరెంట్​ పుష్కలంగా ఉంటుంది. అప్పుడు రైతులు బోర్ల నుంచి నీళ్లను తోడేందుకు డీజిల్​ మోటార్లను వాడాల్సిన అవసరం రాదు. దీంతో ప్రభుత్వానికీ రైతుల డీజిల్​ సబ్సిడీ తగ్గతుంది. అలా ఎంతో కొంత డబ్బులు ఆదా అవుతాయి. ప్రభుత్వ ఖజానా మంచిగుంటుంది.

ప్రధాని మోడీకి చాలా ముఖ్యం

ప్రధాని నరేంద్ర మోడీకీ ఈ నైరుతి చాలా కీలకం. ఎందుకంటే, రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు వర్షాలు రాకపోవడంతో రిజర్వాయర్లు డెడ్​స్టోరేజీకి పడిపోయి కనీసం తాగడానికీ నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. దీంతో కన్జ్యూమర్​ గూడ్స్​ (ఆహార పదార్థాలు)కు గ్రామాల్లో డిమాండ్​ తగ్గింది. వర్షాలు రాకపోతే ఇటు రేట్లూ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ధరల సూచీని డిసైడ్​ చేయడంలో ఆహార పదార్థాల వాటానే సగం. దాని ప్రకారమే వడ్డీ రేట్లు సహా వివిధ ద్రవ్య పరపతి విధానాలను ఆర్బీఐ నిర్ణయిస్తుంటుంది. కాబట్టి పంటలు మంచిగా పండితే ధరలు అదుపులో ఉంటాయి. లేదంటే ఆహార ద్రవ్యోల్బణం పెరిగి ధరలూ పెరుగుతాయి.

ఐఎండీ అంచనాలు పక్కానా?

వర్షాలపై ఐఎండీ అంచనాలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే నిజమవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా అదే ట్రెండ్​ నడుస్తోంది. అది కూడా ఐదు పర్సంటేజీ పాయింట్లు అటూఇటూగా ఉంటుంది. 2008 నుంచి 2017లో ఒక్కసారి మాత్రమే ఐఎండీ అంచనాలు పక్కాగా నిజమయ్యాయి. 2018లో 97 శాతం వర్షపాతం నమోదవుతుందని చెప్పినా, 91 శాతమే మాత్రమే కురిశాయి.