ఇండియా, చైనా బోర్డర్​..లడఖ్ లో లడాయి

ఇండియా, చైనా బోర్డర్​..లడఖ్ లో లడాయి

న్యూఢిల్లీతూర్పు లడక్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ)లో చైనా మోహరించిన బలగాలకు దీటుగా మన సైనికులను పంపాలని, అలాగే రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా, చైనా బోర్డర్​లో ప్రస్తుత పరిస్థితిపై ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​చీఫ్​లు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్​తో డిఫెన్స్ మినిస్టర్ రాజ్​నాథ్ సింగ్ మంగళవారం రివ్యూ చేశారు. ‘‘సమావేశం గంటకు పైగా జరిగింది. చైనా మోహరింపులకు దీటుగా బలగాలను మోహరించాలని మంత్రికి అధికారులు వివరించారు. చర్చలు, దౌత్యపరమైన జోక్యం ద్వారా ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం వస్తుందని సమావేశంలో నిర్ణయించారు. ఇదే సమయంలో మన సైన్యం కూడా ఈ ప్రాంతంపై తన వాదనలను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రోడ్డు నిర్మాణం కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పాయి.

మరో ‘డోక్లాం’ కాబోతోందా?

ప్రస్తుతం ఇండియా, చైనా సరిహద్దుల్లో గొడవ ముదురుతోంది. మరో డోక్లాం లాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. తూర్పు లడక్‌లోని ఎల్‌ఏసీ వెంట రెండు దేశాల మధ్య ఏర్పడిన వివాదం.. రానురాను మరింత పెద్దది అవుతోంది. ఎల్‌ఏసీ వెంబడి పలు లొకేషన్లలో చైనా 5 వేల మందిని మోహరించినట్లు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. చైనా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిందని, టెంట్లు, బంకర్లు ఏర్పాటు చేసిందని చెబుతున్నాయి. దీంతో వివాదం రేగిన పాంగాంగ్, గాల్వాన్ వ్యాలీ ప్రాంతాల్లో ఇండియా కూడా సైనికుల సంఖ్యను పెంచుతోంది. చైనా బలగాలపై నిఘా ఉంచేందుకు సెన్సిటివ్ పాయింట్లలో మన బలగాలు పెట్రోలింగ్ కొనసాగిస్తున్నాయి.

మే 5న గొడవ మొదలు

మే 5న లడఖ్​లో బోర్డర్​లో 2 దేశాలకు చెందిన 250 మంది సోల్జర్లు గొడవకు దిగారు. పిడిగుద్దులు గుద్దుకోవడం, రాళ్లు రువ్వడంతో 100 మందికి గాయాలయ్యాయి. స్థానిక ఆఫీసర్ల చర్చలతో గొడవ సద్దుమణగింది. మళ్లీ 4 రోజులకే సిక్కింలోని నాకు లా పాస్ వద్ద ఫైట్ జరిగింది. 10 మంది గాయపడ్డారు. పెట్రోలింగ్ చేస్తుంటే చైనా బలగాలు అడ్డుకుంటున్నాయని ఇండియా.. తమ టెర్రిటరీలోకి ఇండియన్ సోల్జర్లు చొరబడ్డారని చైనా ఆరోపించాయి.

మోడీ హై లెవెల్ మీటింగ్

చైనాతో గొడవ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. ముగ్గురు సర్వీస్ చీఫ్​లు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్​ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నట్టు తెలిసింది.

వీధి రౌడీల్లా చైనా సోల్జర్లు!

పాంగాంగ్​ దగ్గర ఈ మధ్య జరిగిన గొడవలో మన సోల్జర్లను గాయపరిచేందుకు చైనా సైనికులు కర్రలు, ముళ్లకంచె చుట్టిన రాడ్లు, రాళ్లు ఉపయోగించారు. తమ బలగం ఎక్కువ ఉందని రెచ్చిపోయారు. కాశ్మీర్​లో సోల్జర్లపై పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు రాళ్లు విసిరినట్లుగా.. చైనా సైనికులు బిహేవ్ చేశారని సోర్సెస్ చెప్పాయి. వాళ్ల సైనికులు ఎక్కువగా ఉండటంతో ‘అన్ ప్రొఫెషనల్ ఆర్మీ’లా ప్రవర్తించారని వివరించాయి. మన సైనికులపై బెదిరింపులకు దిగారని, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశారని వెల్లడించాయి.