రెవెన్యూ శాఖలో లక్షల ఫైళ్లు పెండింగ్

రెవెన్యూ శాఖలో లక్షల ఫైళ్లు పెండింగ్
  • స్టాఫ్ లేక ఆగిపోతున్న పనులు
  • ఫీల్డ్ పనంతా గిర్దావర్లు చేయాల్సిందే
  • రిపోర్టులన్నీ వీళ్ల నుంచి రావాల్సిందే
  • ఒక్కో మండలానికి ఒక్కరిద్దరే

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో ఫైళ్లు కదలట్లేదు. అవసరమైనంత స్టాఫ్ లేక లక్షలాది అప్లికేషన్లు పెండింగ్లో పడిపోతున్నాయి. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఫీల్డ్ లెవల్ ఎంక్వైరీలు చాలా లేటవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలన్నీ గిర్దావర్లే (ఆర్ఐ) చేయాల్సి వస్తోంది. భూ వివాదాలు, మ్యుటేషన్లు, క్యాస్ట్, ఇన్కమ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పనులన్నింటికీ ఫీల్డ్ రిపోర్టులను ఆర్ఐలే ఇవ్వాల్సి వస్తోంది. వీళ్లు కూడా మండలానికి ఒకరిద్దరే ఉండటంతో వేలల్లో వస్తున్న అప్లికేషన్లను కరెక్టు టైమ్లో వెరిఫై చేయలేకపోతున్నారు. రిపోర్టులు ఇచ్చేందుకు కలెక్టర్లు, తహసీల్దార్లు టార్గెట్స్ పెడుతుండటంతో గంటల తరబడి డ్యూటీలు చేస్తూ పని ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని చోట్ల అప్లికేషన్ల వెరిఫికేషన్ బాధ్యతలను రూల్స్కు విరుద్ధంగా వీఆర్వోలకే తహసీల్దార్లు అప్పగిస్తున్నారు.  
ధరణి అర్జీలన్నీ ఆర్ఐల వద్దకే.. 
నిషేధిత జాబితాలో నుంచి భూముల తొలగింపు, పాస్ బుక్స్లో తప్పుల సవరణ, సర్వే నంబర్ మిస్సింగ్స్, పెండింగ్ మ్యుటేషన్స్, నాలా పెండింగ్ అప్లికేషన్లను ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం స్వీకరి స్తున్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన అప్లికేషన్లన్నీ నేరుగా కలెక్టర్ల లాగిన్లోకి వెళ్లినా వాళ్లు ఈ అర్జీలపై రిపోర్టును తహసీల్దార్ల నుంచే తెప్పించుకుంటున్నారు. దీంతో చాలా మంది తహసీల్దార్లు ఎప్పటిలాగే ఆర్ఐలను ఫీల్డ్కు పంపి ఎంక్వైరీ తర్వాత రిపోర్టు తీసుకొని కలెక్టర్లకు పంపిస్తున్నారు. ధరణిలో ఇలాంటి అప్లికేషన్లు ఒక్కో మండలం నుంచి వేలల్లో వస్తున్నాయి. కానీ మండలానికి ఒకరిద్దరు ఆర్ఐలే ఉండటంతో సకాలంలో రిపోర్టులు ఇవ్వలేకపోతున్నారు. ధరణి పోర్టల్ ద్వారా గ్రీవెన్స్ ఆప్షన్ ఇచ్చాక రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అప్లికేషన్లు వస్తున్నాయని, వీటన్నింటిపై ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇవ్వాలంటే రెండేళ్లయినా సరిపోదని వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఆర్ఐ ఒకరు వెల్లడించారు. 
సర్కారు సంస్కరణలతో ఆర్ఐలపై భారం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లకు అప్లై చేసుకుంటే పెళ్లి కూతురు వయసు, క్యాస్ట్తో పాటు ఇతర అర్హతలపై ఆర్ఐలే వెరిఫికేషన్ చేయాలి. వాళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే లబ్ధిదారులకు డబ్బులు మంజూరవుతాయి. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, ఈడబ్ల్యూఎస్లాంటి సర్టిఫికెట్ల కోసం ఎవరైనా ‘మీ సేవ’లో అప్లై చేస్తే సర్టిఫికెట్ జారీకి కూడా ఆర్ఐలే ఫీల్డ్ లెవల్లో వెరిఫికేషన్ చేయాలి. గతంలో ఊరికో వీఆర్వో ఉండటం వల్ల వాళ్లే ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇచ్చేవారు. వాళ్ల రిపోర్టును గిర్దావర్లు పరిశీలించి తహసీల్దార్లకు పంపితే సర్టిఫికెట్లు జారీ అయ్యేవి. ఇప్పుడు వీఆర్వోలు లేక ప్రతి ఊరికీ ఆర్ఐలే వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు  గిర్దావర్లపై పని భారం మోపాయి. 
జనం సంతోషంగా ఉన్నరా.. అంతా వట్టిదే 
వీఆర్వో వ్యవస్థ రద్దయి ధరణి పోర్టల్ వచ్చాక జనం సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చేస్తున్న ప్రచారమంతా వట్టిదేననే కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. తహసీల్దార్ స్థాయి అధికారుల వరకు బాగానే ఉన్నారని.. డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలపై పని భారం పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. సిబ్బంది కొరతతో ప్రజలకు సేవలందడం లేదని, భూ సమస్యలపై ధరణి పోర్టల్లో అర్జీ పెట్టుకుంటే పరిష్కారం లేటవుతోందని అంటున్నారు. తహసీల్దార్లు, ఆపై క్యాడర్లో ఉన్న కొద్దిమందికి సంబంధించిన ప్రమోషన్లు, పోస్టింగ్లపైనే సర్కారుకు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు వినతి పత్రాలు ఇస్తున్నారని.. వేలల్లో ఉన్న డీటీలు, ఆర్ఐలు, వీఆర్వోలు, వీఆర్ఏల సమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.