
- అప్పులు చేసి.. ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని.. ఏడాదికి పైగా ప్రిపేరైన్రు
- మళ్లీ ప్రిపరేషన్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి
- ఇష్యూను పొలిటికలైజ్ చేసి డైవర్ట్ చేయాలని సర్కారు చూస్తున్నదని మండిపాటు
హైదరాబాద్, వెలుగు:ఏండ్లకేండ్ల ఎదురుచూపుల తర్వాత నోటిఫికేషన్లు పడ్డయి.. కష్టపడితే సర్కారు కొలువు వస్తదని ఆశపడ్డరు. ప్రైవేటు ఉద్యోగాలను వదులుకుని కొందరు.. చేస్తున్న పనులను మానుకుని ఇంకొందరు.. మరెందరో నిరుద్యోగులు.. నిద్రాహారాలు మాని ప్రిపేర్ అయిన్రు. అప్పులు చేసి పుస్తకాలు కొని, కోచింగ్‌కు వెళ్లి.. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉండి చదువుకున్నరు. కానీ ఇప్పుడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నరు. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడుతున్నరు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగులు అరిగోస పడుతున్నరు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, అశోక్‌నగర్, చిక్కడపల్లి సెంట్రల్‌లైబ్రరీ వద్ద ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్నాళ్లు కోచింగ్ సెంటర్ల ఫీజులు, స్టడీ హాల్రెంట్స్, హాస్టల్ ఫీజులు, రూమ్ రెంట్స్, స్టడీ మెటీరియల్ కొనుగోలు కోసం లక్షల్లో ఖర్చు చేశామని.. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఖర్చు పెడుతూ పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది పరీక్షలు నిర్వహిస్తరా?
పరీక్షల రద్దు ప్రభావం ఇప్పటికే నిర్ణయించిన ఎగ్జామ్స్ షెడ్యూల్‌పై పడితే అవి కూడా వాయిదా పడుతాయని, దీంతో తమపై మరింత భారం పడుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రద్దు చేసిన ఏఈఈ, ఏఈ, డీఏవో.. వాయిదా వేసిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. నోటిఫికేషన్ ఇచ్చిన జూనియర్లెక్చరర్ పరీక్షల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది ఇప్పటికే కేంద్ర నియామక పరీక్షలు, బ్యాంకింగ్ సహా ఇతర పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. దీంతో అసలు 2023లో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుందా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసిన నిరుద్యోగులు ఇప్పుడు అదనంగా ఇంకో రూ.1.50 లక్షల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తున్నది. పేద యువత ఇంత భారం మోసే పరిస్థితుల్లో లేరు.
మళ్లీ పరీక్షలు జరిగినా పేపర్ లీక్ కాదన్న గ్యారంటీ ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర సర్కార్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం చూపాల్సింది పోయి.. రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రిపరేషన్‌కు లక్షల్లో ఖర్చు
రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ప్రభుత్వం గతేడాది ప్రకటించిన నాటి నుంచే విద్యార్థులు, నిరుద్యోగులు హైదరాబాద్‌కు వచ్చి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. సర్కారు కొలువు సాధించాలనే పట్టుదలతో ఏడాదికి పైగా కోచింగ్ తీసుకుంటున్నారు. 15 లక్షల మంది నిరుద్యోగులు తమ ఇండ్లకు దూరంగా ఉంటూ చదువుతున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఇంకో పది లక్షల మందికి పైగానే యువత ప్రిపేర్అవుతున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో గ్రూప్– 1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డీఏవో పరీక్షలను రద్దు చేశారు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్పరీక్షలు వాయిదా వేశారు.
మిగతా నాలుగు పరీక్షలకు 4,69,287 మంది అటెంట్ అయ్యారు. గ్రూప్– 1 ప్రిలిమ్స్‌లో 25 వేల మందికి పైగా క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్లంతా మళ్లీ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై కావాల్సి ఉంది. దీంతో మెయిన్స్ ప్రిపరేషన్ పక్కన పెట్టి ప్రిలిమ్స్ కోసం చదవాల్సిన పరిస్థితి. మిగతా మూడు పరీక్షలు రాసిన వారిలో చాలా మంది తమకు ఉద్యోగం వచ్చి తీరుతుందనే నమ్మకంతో ఉన్నారు. వాళ్లు కూడా మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించాల్సిందే. దీంతో లక్షలాది రూపాయలు కోచింగ్ కోసం, హాస్టల్ ఫీజుల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం యువత కోచింగ్, మెటీరియల్సహా ఇతర ఖర్చుల కోసం సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా సమాచారం.
డైవర్షన్ పాలిటిక్స్‌లో సర్కారు!
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ అనేది వ్యవస్థ లోపం కానే కాదని.. ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన పని అంటూ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పడంపై యువత మండిపడుతున్నారు. సిట్దర్యాప్తు సాగుతుండగా.. ‘ఇద్దరు మాత్రమే చేసిన పని’ అని కేటీఆర్ఎలా చెప్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పేపర్ల లీకేజీ వెనుక మాస్టర్‌మైండ్‌గా చెప్తున్న రాజశేఖర్‌రెడ్డి.. బీజేపీ కార్యకర్త అని, సోషల్‌మీడియాలో ఆ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టారని కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పారు. లీకేజీ వెనుక బీజేపీనే ఉందన్నట్టు సర్కారు అనుకూల మీడియా, సోషల్‌మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయనే అనుమానాలు యువతలో ఉన్నాయి. పేపర్ల లీకేజీ, పరీక్షల రద్దు నిర్ణయంతో సర్కారుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటం, ఇంటెలిజెన్స్ సహా అన్ని సోర్సులు ఇదే తరహాలు ఇన్పుట్స్ ఇవ్వడంతో ప్రభుత్వం శనివారం హడావుడి మొదలు పెట్టింది. సీఎం కేసీఆర్అధ్యక్షతన హైలెవల్మీటింగ్పెట్టగా.. తర్వాత మీడియా ముందుకు కేటీఆర్ వచ్చారు. మొత్తంగా సర్కారు ఫెయిల్యూర్‌ను పొలిటికలైజ్ చేసి డైవర్ట్చేయడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనే ప్రయత్నాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తున్నది.
మీరిచ్చే భరోసా ఇదా?
ప్రభుత్వ కంటి తుడుపు చర్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రద్దు చేసిన పరీక్షలకు మళ్లీ ఫీజు తీసుకోబోమని చెప్పడం, ఆన్లైన్ మెటీరియల్ ఇస్తామని వ్యాఖ్యానించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉండి కేటీఆర్ తమకు ఇచ్చే భరోసా ఇదా? అని ప్రశ్నిస్తున్నారు. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం ఆడుతున్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా అనేక పరీక్షలు రద్దు చేసి.. రాసిన పరీక్షలే మళ్లీ రాయాలంటే నిరుద్యోగులు చేయని తప్పుకు శిక్ష అనుభవించడమే. ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి ప్రిపేర్ అయ్యారు. వారికి ఉచిత కోచింగ్ ఇవ్వడమే కాదు.. ప్రతి నెల రూ.10 వేల చొప్పున స్టైఫండ్‌గా ఇవ్వాలి. - కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
మెట్రోలో భిక్షాటన
సర్కారు తీరుపై నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హైదరాబాద్‌మెట్రో రైల్లో భిక్షాటన చేశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల రద్దుతో నష్టపోయామని.. తమ సమస్యలను అర్థం చేసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యువత సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతూ శనివారం ఆందోళనలు చేపట్టారు.
మళ్లీ లీక్ కాదని గ్యారెంటీ ఏంటి?
గ్రూప్–1 కోసం కోచింగ్ తీసుకొని రెండేండ్లుగా సిద్ధమవుతున్న. ఇంటికెళ్లకుండా ప్రిపేర్అవుతూ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీకైందని రద్దు చేశామని చెప్పిన్రు. ఏం చేయోలో అర్థమైతలేదు. అప్పు తెచ్చి మరీ చదువుతున్నం. పేపర్ మళ్లీ లీక్ కాదని గ్యారెంటీ ఏంటి? మళ్లీ అయినా సక్రమంగా నిర్వహిస్తారనే నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించాలి. - నరేశ్, ఖమ్మం
సివిల్స్ వదిలి.. ప్రిపేర్ అయిన
రెండు సార్లు సివిల్స్ మెయిన్స్ పరీక్ష రాసిన. గ్రూప్–1 నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ర్యాంక్ సాధించి రాష్ట్రంలో సేవ చేయాలని సిద్ధమైతున్న. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కావడంతో మెయిన్స్‌కు ప్రాక్టీస్ చేస్తున్న. ఇప్పుడు పరీక్ష రద్దుతో గందరగోళంలో ఉన్న. మళ్లీ ఎగ్జామ్స్, రిజల్ట్కు ఎంత టైమ్ పడుతుందో.. అప్పటివరకు కుటుంబంపై ఆధారపడడం ఇబ్బందిగా ఉంది. - సృజన్, కరీంనగర్
ఇంటికెళ్లి మూడేండ్లు అయింది
జాబ్ వచ్చాకే ఇంటికెళ్లాలని మూడేండ్లుగా డీఏవో పరీక్షకు సిద్ధమైతున్న. అప్పులు చేసి, లైబ్రరీలో చదువుతూ పరీక్ష రాసిన. కొలువు వస్తుందనే ఆశతో ఉన్న. జాబ్ వచ్చిందనే కబురుతో మూడేండ్ల తర్వాత ఇంటికెళ్తననే సంతోషంలో ఉన్న. ఇప్పుడు డీఏవో పరీక్ష రద్దు చేయడంతో అంతా మొదటికొచ్చింది. - వంశీ, ఖమ్మం