వైభ‌వంగా ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి జ‌యంత్యుత్సవాలు

వైభ‌వంగా ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి జ‌యంత్యుత్సవాలు

యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం (మే 2వ తేదీన) ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆల‌య అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాల్లో పాల్గొన్న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మృత్యుంగ్రహణం, అంకురార్పణ, హవనం గరుడవాహన పరవాసుదేవ అలంకార సేవలో దేవాదాయ శాఖ మంత్రి పాల్గొన్నారు. 

జ‌యంత్యుత్సవాల్లో భాగంగా సాయంత్రం 6:00 గంటలకు అంకురార్పణ, రుత్విగ్వరణం, హవనం నిర్వహించి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవను చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 2 నుంచి 4 వరకు సుదర్శన నారసింహహోమం, నిత్య, శాశ్వత తిరు కల్యాణోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

ఉత్సవాల సందర్భంగా ప్రధానాలయంలోని ఉత్తర రాజగోపురం వెలుపలి ప్రాకార మండపంలో యాగశాల ఏర్పాటు చేశారు. 3వ తేదీన 9 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, కాళీయ మర్థన అలంకార సేవలో స్వామివారిని తిరుమాఢవీధుల్లో ఊరేగించనున్నారు. 10:30 గంటలకు లక్ష పుష్పార్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకార సేవ ఉంటుంది. 

4వ తేదీన 7 గంటలకు మూలమస్తృ హవనం, ఉదయం 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు పూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.