చికెన్ కిలో@ రూ.290..నెల రోజుల్లో రూ.100 పెరిగింది

చికెన్ కిలో@  రూ.290..నెల రోజుల్లో రూ.100 పెరిగింది
  • నెల రోజుల్లోనే ఏకంగా రూ.100కి పైగా పెరిగిన రేటు
  • కార్తీక మాసం తరువాత 
  • భారీగా పెంచి అమ్మకాలు
  • ఇప్పటికే రూ.8 దాటిన ఎగ్ ధర.. కంట్రీ ఎగ్ రేటు రూ.20కి  
  • ఉత్పత్తి తగ్గడంతో పైపైకి ధరలు

హైదరాబాద్, వెలుగు:చల్లటి వింటర్ లో హాట్ హాట్​గా చికెన్ తినాలనుకునే వారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కోడిగుడ్ల ధరలు భారీగా పెరగగా, ఇప్పుడు కోడి కూర కూడా పిరమైపోయింది. ఆదివారం ఏకంగా కిలో స్కిన్ లెస్ చికెన్‌‌ ధర రూ.290కి ఎగబాకింది. ఇప్పటికే కోడి గుడ్డు ధర రూ.8 దాటిపోగా, కంట్రీ కోడిగుడ్డు ఒక్కోటి రూ.20 పలుకుతోంది. 

తాజాగా చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి కారణం శీతాకాలంలో గిరాకీ పెరగడం, అలాగే క్రిస్మస్, న్యూఇయర్ వస్తుండడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అధికమైంది. దీనికి తోడు కోడి దాణా ధరలు పెరిగాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు న్యూఇయర్ నాటికి కేజీ చికెన్ ధర రూ.300 నుంచి రూ.330 దాటినా ఆశ్చర్యం లేదని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు.

నెలలోనే రూ.100 పెరిగింది..  

నెల కిందటి వరకు రూ.190 నుంచి రూ.200 మధ్య కొనసాగిన చికెన్‌‌ ధర.. ఈ నెల ప్రారంభంలో కిలో రూ.230 వరకు చేరింది. ఈ ఆదివారం ఏకంగా రూ.290కి పెరిగింది. నెల వ్యవధిలోనే ఏకంగా రూ.100కి పైగా పెరగడం గమనార్హం. గత నెలలో కిలో చికెన్ కూర ధర రూ.200లోపే ఉన్నది. 

గతనెల 20న కార్తీకమాసం ముగియగానే కిలో చికెన్​పై రూ.60 నుంచి రూ.90 పెంచి అమ్ముతున్నారు. ధరల పెరుగుదలకు ఉత్పత్తి తగ్గడమే కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెప్తున్నారు. పడిపోయిన ఉష్ణోగ్రతల ప్రభావం, దాణా ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు.