ఆ పాట నా కెరీర్​కి బిగ్గెస్ట్​ టర్నింగ్​ పాయింట్​

ఆ పాట నా కెరీర్​కి బిగ్గెస్ట్​ టర్నింగ్​ పాయింట్​

‘లాలా భీమ్లా...అడవి పులి’.. వింటుంటేనే రోమాలు నిక్కపొడుచుకునే ఈ పాట పాడింది మన తెలుగబ్బాయే. పేరు అరుణ్​ కౌండిన్య. కొత్త సింగరేం కాదు. గడిచిన ఏడేళ్లలో ఎన్నో సూపర్​ హిట్స్​ సాంగ్స్​లో వినిపించింది ఇతడి గొంతు. అవన్నీ ఒక ఎత్తు అయితే.. ‘భీమ్లా నాయక్’ సినిమా​లోని ఈ ఒకే ఒక్క  పాటతో  యమా​ క్రేజ్​ తెచ్చుకున్నాడు​. ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​ అయ్యాడు. ఈ పాట తన కెరీర్​కి బిగ్గెస్ట్​ టర్నింగ్​ పాయింట్​ అంటున్న ఈ సింగర్​ డెంటిస్ట్​ కూడా. 

డాక్టర్​ అవ్వబోయి యాక్టర్​ అయ్యామని చాలామంది చెప్తుంటారు. కానీ, ఇక్కడ అరుణ్​ మాత్రం యాక్టింగ్​కి బదులు సింగింగ్​ని ఎంచుకున్నాడు. అలాగని ప్రొఫెషన్​ని పక్కన పెట్టాలనుకోలేదు​. ప్యాషన్​, ప్రొఫెషన్​ రెండింటిలోనూ రాణించాలనుకున్నాడు. డాక్టర్​గా జనాలు బాధలు తీర్చుతూనే.. సింగర్​గా వాళ్ల మనసులోని భారాల్ని తేలిక చేయాలనుకున్నాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. మరి రెండింటినీ బ్యాలెన్స్​ చేయడం కష్టం అవ్వలేదా?  అని అడిగితే ఇష్టం ఉన్న చోట కష్టానికి చోటు ఎక్కడిది అంటున్నాడు. కానీ, ప్రస్తుతం ఫోకస్​ అంతా సింగింగ్​పైనే ఉందంటూ తన ఏడేళ్ల మ్యూజిక్​ జర్నీలోని అప్స్​ అండ్​ డౌన్స్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

నాలుగేళ్లకే మ్యూజిక్​ క్లాస్​

 నేను పాడగలను అని మొదట గుర్తించింది మా అమ్మానాన్న. వాళ్లూ సంగీతంలోనే పుట్టి, పెరిగారు. నాన్న ఎయిర్​ఫోర్స్​ ఉద్యోగి.  సింగర్​ కమ్​ గిటారిస్ట్​ కూడా. అమ్మ కూచిపుడి డాన్సర్​. మా పెదనాన్న ఆల్​ ఇండియా రేడియోలో హార్మోనియం వాయించేవాళ్లు. ఇంకా నాన్న తరపు  బంధువుల్లో చాలామందికి సంగీతంలో అనుభవం ఉంది. దాంతో నాక్కూడా సంగీతం నేర్పించాలనుకున్నారు అమ్మానాన్న. అలా నాలుగేళ్ల వయసులోనే మా స్కూల్​ మ్యూజిక్​ టీచర్​ సుభాషిణిగారి  దగ్గర కర్ణాటక సంగీతంలో చేర్పించారు.​ అదంతా నాకు ఊహ తెలియకముందు జరగడంతో ఏం గుర్తులేదు. కానీ, కాస్త జ్ఞాపకం వచ్చాక అందరూ ‘‘బాగా పాడుతున్నావ్’’​ అని చెప్పడంతో ఇంకా బాగా పాడాలన్న  పట్టుదల వచ్చింది.  

ఆ తరువాత లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారి దగ్గర కర్ణాటక సంగీతంలో చేరా. అదే టైంలో రామాచారి గారి దగ్గర లైట్​ మ్యూజిక్​ నేర్చుకున్నా.  చుట్టుపక్కల ఏ మ్యూజిక్​  కాంపిటీషన్​ జరిగినా పార్టిసిపేట్​ చేసేవాడ్ని. బోలెడు ప్రైజ్​లు కూడా గెలుచుకునేవాడ్ని. టీవీ షోలలోనూ పార్టిసిపేట్​ చేశా. మాటీవీ ‘పాడాలని వుంది’ లో నేను పాడిన ‘చూడాలని వుంది’ సినిమాలోని ‘యమహా నగరి...’ పాట బాలుగారికి చాలా బాగా నచ్చింది. అది విన్నాక  ‘ఫ్యూచర్​లో​ నువ్వు పెద్ద సింగర్​ అవుతా’వు అన్నారాయన . ఆ తర్వాత మరో ఎపిసోడ్​లో  ‘రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..’ పాట పాడా. ఆ పాట బాలుగారికి ఎంతలా నచ్చిందంటే.. ఆయనే స్వయంగా స్టేజ్​ మీదకి వచ్చి నన్ను హగ్​ చేసుకున్నారు. అవన్నీ నా సింగింగ్​పై నాకు కాన్ఫిడెన్స్​ పెంచాయి. మ్యూజిక్​ వైపు మరిన్ని అడుగులు వేయించాయి. కానీ, చదువు వల్ల కొన్నాళ్లు మ్యూజిక్​ని పక్కనపెట్టక తప్పలేదు. 

ప్యాషన్​.. ప్రొఫెషన్..

మ్యూజిక్​ అంటే ఎంతిష్టమో.. చదువన్నా అంతే శ్రద్ధ నాకు. అందుకే చిన్నప్పట్నించీ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రానివ్వలేదు. కానీ, గ్రాడ్యుయేషన్​కి వచ్చేసరికి..రెండింటిలో  ఏదో ఒకటి వదులుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో అందరి పేరెంట్స్​లాగే మా అమ్మానాన్నలకి కూడా ఎడ్యుకేషన్​ ఇంపార్టెంట్​ అనిపించింది. నాక్కూడా డాక్టర్​ అవ్వాలని బలంగా ఉండటంతో  బీడిఎస్​( బ్యాచిలర్​ ఆఫ్​ డెంటల్​ సర్జరీ) లో చేరాలనుకున్నా. దానికోసం ఖమ్మంలోని మమత మెడికల్​ కాలేజీకి వెళ్లా. దాంతో మ్యూజిక్​ క్లాస్​లకి బ్రేక్​​ పడింది. ఆ తరువాత రెండేళ్లు పీజీ. ఒక సంవత్సరం ప్రాక్టీస్​. అలా దాదాపుగా ఎనిమిదేళ్లు మ్యూజిక్​కి దూరమయ్యా. కానీ వీకెండ్స్​, సెలవుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు రామాచారిగారి దగ్గర మ్యూజిక్​ పాఠాలు వినేవాడ్ని. 

మళ్లీ మ్యూజిక్​ వైపు..

నేను కలలు కన్న డాక్టర్​ పట్టా వచ్చింది.. సంవత్సరం ప్రాక్టీస్​ తర్వాత ఫ్రెండ్స్​తో కలిసి హైదరాబాద్​లో క్లినిక్​ కూడా తెరిచా. కానీ, చిన్నప్పట్నించీ నేర్చుకున్న మ్యూజిక్​ని వదల్లేకపోయా. అప్పటికే చిన్నప్పుడు నాతో పాటు ఎల్​ఎమ్​ఏ( లిటిల్​ మ్యుజీషియన్స్​ అకాడమీ) లో మ్యూజిక్​ నేర్చుకున్న గీతామాధురి, కృష్ణ చైతన్య, కారుణ్య, హేమచంద్ర  సినిమాల్లో పాడుతున్నారు. వాళ్లందర్నీ చూశాక నా మనసు కూడా మ్యూజిక్​ వైపు లాగింది. కానీ, ఈ విషయం ఇంట్లో చెప్తే వద్దన్నారు. క్లినిక్ వదిలేసి.. ‘అవకాశాలు ఎప్పుడు వస్తాయో.. అసలు వస్తాయో లేదో తెలియని ఫీల్డ్​కి ఎందుకు ’అన్నారు. కష్టపడి వాళ్లని ఒప్పించి ఇండస్ట్రీకి వచ్చా.  వైజర్సు సుబ్రహ్మణ్యం గారి దగ్గర మ్యూజిక్​లో చేరా. సినిమాలకి డెమోలు ఇవ్వడం మొదలుపెట్టా. ఆ టైంలో మ్యూజిక్​ డైరెక్టర్​ కోటి చాలా సపోర్ట్​ ఇచ్చారు. ఆయన జడ్జిగా ఉన్న ‘బోల్​ బేబి బోల్​’కి మెంటార్​గా అవకాశం ఇచ్చారు. ఆ షో తరువాత సీజన్​లో కంటెస్టెంట్​గానూ కనిపించా. అవన్నీ నాలో మరింత కాన్ఫిడెన్స్ పెంచాయి. అప్పుడే అనూప్​ రూబెన్స్​, కీరవాణి, తమన్​.. ఇలా అందరి మ్యూజిక్​ డైరెక్టర్స్​కి  రెగ్యులర్​గా కోరస్​లు పాడటం మొదలుపెట్టా. 

అన్నీ సెట్​ అవ్వవు..

‘టెంపర్’ ​ సినిమాలోని ‘ఇట్టాగె  రెచ్చిపోదాం..’ నేను పాడిన మొదటి పాట.  గీతామాధురి, ధనుంజయ్​తో కలిసి పాడిన ఆ పాట తర్వాత చాలా హిట్​ సినిమాలకి కోరస్​లు పాడా. ‘కేజీఎఫ్​, బాహుబలి, ఆర్​ఆర్​ఆర్’​ లాంటి పెద్దపెద్ద సినిమాలకి గ్రూప్​ సింగర్​గా పనిచేశా. కానీ, సోలో సింగర్​గా నేను అనుకున్న బ్రేక్​ రాలేదు. కొన్ని పాటలకి నా వాయిస్ సెట్​ అయ్యేది కాదు.. అది ఓకే అనుకుంటే హీరోకి నా వాయిస్​ సెట్​ అయ్యేది కాదు. ఇలా అన్నీ చేజారిపోయేవి. కానీ, ఎప్పుడూ డిజప్పాయింట్​ అవ్వలేదు. ట్రాక్స్​, కోరస్​లు పాడుతూ నన్ను నేను ఇంప్రూవ్​ చేసుకునే ప్రయత్నం చేశా.  ఆ ప్రయత్నాలన్నీ ఫలించి ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​ నుంచి పిలుపు వచ్చింది. 
‘లాలా భీమ్లా..’ పాటకి శ్రీకృష్ణ అన్న నన్ను సజెస్ట్​ చేశాడు. అది సోలో సింగర్​ పాట అని తెలియదు నాకు.‘ భీమ్లా నాయక్’​ సినిమా కోసం అని కూడా ఊహించలేదు. కోరస్​ కోసం పిలిచారు అనుకుని స్టూడియోకి వెళ్లా. కానీ, అక్కడ మిగతా సింగర్స్​ ఎవరూ కనపడలేదు. గ్లింప్స్ పాడాలని లిరిక్​ పేపర్ ఇచ్చారు. అందులో లాలా భీమ్లా అని లిరిక్​ చూశాక ఆ పాట ఈ సినిమా కోసమని అర్థమైంది.  పాడి వచ్చేశా. అది ఒకే అయితే బాగుండు అన్న హోప్​ ఉంది గానీ.. మనసులో ఏదో ఒక మూల టెన్షన్​. తీరా గ్లింప్స్​ రిలీజ్​ అయ్యాక నా  గొంతే ఉండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యా. దానికి మంచి రీచ్​ రావడంతో ఫుల్​ సాంగ్  చేయాలనుకుంది టీమ్. అది కూడా నాతోనే పాడించడం.. పైగా ఆ సాంగ్​ వీడియోలోనూ నన్ను భాగం చేయడం నా కెరీర్​కి బాగా హెల్ప్​ అయింది. ఆ సాంగ్​ బయటికొచ్చాక  ఇండస్ట్రీలోని చాలామంది మెచ్చుకున్నారు. 

ఏడేండ్ల కష్టానికి...

సోలో సింగర్​గా ఇప్పటివరకు దాదాపు ఇరవై పాటలు పాడా. వందల పాటలకి కోరస్​ ఇచ్చా. కంటిన్యూస్​గా ఇండస్ట్రీలో పని ఉంటుంది. కానీ, నా హార్డ్​ వర్క్​కి  తగ్గ గుర్తింపు లేదు. సింగర్​గా నన్ను నేను నిరూపించుకునే సాంగ్స్​ రాలేదు. కానీ, ఏరోజూ కాన్ఫిడెన్స్​ కోల్పోలేదు. కచ్చితంగా నాకంటూ ఒకరోజు వస్తుందని నమ్మా.  ఏడేండ్లకి ‘లాలా.. భీమ్లా’​ ద్వారా నేను కోరుకున్న గుర్తింపు వచ్చింది. సింగర్​గా వందశాతం సక్సెస్​ అయ్యానని  నేను చెప్పను. నిజానికి ఇప్పుడే నా మ్యూజిక్​ కెరీర్​ మొదలైంది. ఇన్నాళ్లు ఈ రోజు కోసం ప్రాక్టీస్​ చేశాను అంతే. ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై పాటలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటిల్లో మెలొడీలతో పాటు హీరో ఇంట్రడక్షన్​, మాస్​ సాంగ్స్​ కూడా ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడలో కూడా సాంగ్స్​ పాడుతున్నా. అయితే ఇవన్నీ ఎంత సంతోషాన్ని ఇస్తున్నా..  మా అమ్మ  నా సక్సెస్​ని చూడలేకపోయారన్న బాధ ఉంది. పోయిన ఏడాది అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. 

ఆటలు  కూడా ఆడతా

పాటలతో పాటు ఆటల్లోనూ ముందుంటా నేను. క్రికెట్, ​ టెన్నిస్​ బాగా ఆడతా. ఆవకాయ, పెరుగన్నం నా ఆల్​ టైం ఫేవరెట్​ ఫుడ్​. బాలుగారి పాటలంటే చాలా ఇష్టం. రికార్డింగ్స్​ లేకపోతే నా భార్య మైథిలితోనే  టైం గడిపేస్తా. నా బెస్ట్​ ఫ్రెండ్స్​ అంతా ఇండస్ట్రీలోని సింగర్సే. వాళ్లతో వీకెండ్స్​ జాలీగా స్పెండ్​ చేస్తా. అప్పుడప్పుడు నా క్లినిక్​కి కూడా వెళ్తుంటా. ఫ్యూచర్​లో అందరికీ నచ్చే పాటలు పాడతానన్న నమ్మకంతో ఉన్నా.

::: ఆవుల యమున