లంబాడీలను ఎస్టీల్లోంచి తొలగించాలి..ఆదిలాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌ ఎదుట ఆదివాసీల ధర్నా

లంబాడీలను ఎస్టీల్లోంచి తొలగించాలి..ఆదిలాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌ ఎదుట ఆదివాసీల ధర్నా

ఆదిలాబాద్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌ ఎదుట ధర్నాకు దిగారు. తొమ్మిది తెగల ఆదివాసీలు, రాయిసెంటర్ల సార్మెడీలు ముందుగా ఆదిలాబాద్‌‌‌‌ రూరల్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్ద ధర్నా చేపట్టి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంప్రదాయ డోలు వాయిస్తూ ర్యాలీగా కుమ్రంభీం చౌక్‌‌‌‌కు చేరుకొని కుమ్రం భీం విగ్రహానికి నివాళులర్పించారు.

 తర్వాత కలెక్టరేట్‌‌‌‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో స్రవంతి కలెక్టరేట్‌‌‌‌కు చేరుకొని ఆదివాసీలతో మాట్లాడినా ధర్నా విరమించకుండా... కలెక్టర్‌‌‌‌ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నలభై ఏండ్లుగా లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్లు పొందుతూ ఆదివాసుల విద్య, 
ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. 

1977 ఎమర్జెన్సీ టైంలో లేని లంబాడీలు.. తర్వాత ఆదివాసీలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. వలస లంబాడీలను డీఎన్టీగా గుర్తించారే తప్ప ఆదివాసీలుగా ఎక్కడా చెప్పలేదన్నారు. కానీ ఆఫీసర్లు, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని వారు ఎస్టీలుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు లంబాడీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు గణేశ్, తనాజీ, వెంకటేశ్, సోనేరావు, జంగు పటేల్, విశ్వంబర్, పాల్గొన్నారు.