ఎస్టీ జాబితాలో చేర్చండి : లబాన్ (కాయితీ) లంబాడీలు

ఎస్టీ జాబితాలో చేర్చండి : లబాన్ (కాయితీ) లంబాడీలు
  • ఎస్టీ జాబితాలో చేర్చి.. పోడు పట్టాలియ్యాలె
  • కామారెడ్డిలో లబాన్​ లంబాడీల ఆందోళన
  •     ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  •     ఇరువర్గాల మధ్య తోపులాట
  •     కలెక్టరేట్​ ఎదుట రెండు గంటల పాటు ధర్నా

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో లబాన్ (కాయితీ) లంబాడీలు శనివారం పెద్ద ఎత్తున  ఆందోళన నిర్వహించారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని, పోడు పట్టాలివ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్​ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్, ఆదిలాబాద్​తదితర జిల్లాల నుంచి వందలాది మంది లబాన్​లంబాడీలు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. సీఎస్ఐ గ్రౌండ్​నుంచి ర్యాలీగా కలెక్టరేట్​వైపు వెళ్తుండగా.. పర్మిషన్​ లేదంటూ కొత్త బస్టాండ్​వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వందలాది మంది నిజాంసాగర్​చౌరస్తాకు చేరుకుని రోడ్డుపై ఆందోళన చేశారు. అరగంటకు పైగా ఇక్కడ నిరసన తెలిపి, తిరిగి  వివిధ మార్గాల్లో  కలెక్టరేట్​కు చేరుకున్నారు. బారీ కేడ్లను నెట్టుకుంటూ లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ మెయిన్​గేటు ముందు రోడ్డుపై భైఠాయించి సుమారు 2 గంటలపాటు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని చెప్పారు. ఆ తర్వాత 15 మంది వెళ్లి కలెక్టర్​జితేశ్​వి పాటిల్​కు వినతి పత్రం  అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్​ఇచ్చిన హామీ మేరకు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్​చేశారు.

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు పోడు పట్టాలు ఇవ్వకుండా, వాటిని లాక్కునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. 

ర్యాలీకి రాకుండా ముందస్తు అరెస్టులు..

కామారెడ్డిలో ర్యాలీకి హాజరుకాకుండా పలు చోట్ల సంఘం ప్రతినిధులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గాంధారి మండలానికి  చెందిన స్టేట్​ప్రెసిడెంట్​తాన్​సింగ్​ను శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసి, ఆయనతో పాటు మరికొంత మందిని జుక్కల్​ఏరియాలోని పోలీస్​స్టేషన్లకు తరలించారు. ఆందోళన ముగిసిన తర్వాత వారిని వదిలి పెట్టారు.