సైనిక లాంఛనాలతో సాయితేజకు అంతిమ వీడ్కోలు

సైనిక లాంఛనాలతో సాయితేజకు అంతిమ వీడ్కోలు
  • సైనిక లాంఛనాలతో ముగిసిన సాయితేజ అంత్యక్రియలు

చిత్తూరు: తమిళనాడులో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో అమరుడైన సైనికుడు లాన్స్‌ నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అతడి భౌతిక కాయాన్ని ఖననం చేశారు. భరత భూమి ఒడిలో ఒదిగిపోయిన సాయితేజను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం కన్నీటి వీడ్కోలు పలికారు. 

మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు 30కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగింది. కడసారి వీడ్కోలు సందర్భంగా సాయితేజ భౌతిక కాయం చూసి భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  ఆదివారం ఉదయం బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్‌ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్‌, వలసపల్లి మీదుగా రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. మదనపల్లి నుంచి ఎగువరేగడ గ్రామం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్రలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువత, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ పతాకాలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న సాయితేజ పార్థివదేహాన్ని చూసి భార్య శ్యామల, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎగువరేగడ మైదానంలో ఉంచిన సాయితేజ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. 'సాయితేజ అమర్‌ రహే' నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం సాయితేజ వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.