భూసేకరణ పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ ఎస్.వెంకట్ రావు

భూసేకరణ పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
  • జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్​ 
  • యువజనోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద గ్రావిటీ కెనాల్ పనుల కోసం భూసేకరణ, పీఆర్ఎల్ఐ కింద ఆర్అండ్​ఆర్​పనులను స్పీడప్ చేయాలని  కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ లో ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ, వివిధ ఇంజినీరింగ్​శాఖల  ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 రోజుల్లో పెండింగ్ భూసేకరణ సమస్యను  పరిష్కరించి పనులు మొదలు పెట్టాలన్నారు. కోయిల్ సాగర్  మెయిన్​లెఫ్ట్​కెనాల్​ భూసేకరణ  పనులు కూడా స్పీడప్ చేయాలన్నారు. గతంలో ఇచ్చిన అవార్డు వివరాలు, చెల్లింపులు పక్కాగా సమీక్షించి  వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.  పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాల పనులపై, నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో చేపట్టిన ‘డబుల్’ ఇండ్లలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే సమీక్షించారు. సిద్దాయపల్లి ‘డబుల్’ ఇండ్లలో, ఇతర హౌసింగ్ కాలనీల్లో పెండింగ్ లో ఉన్న మౌలిక వసతుల పనులను స్పీడప్​చేయాలని అధికారులను కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో  ముందుకు  వెళ్తే పనులు త్వరగా పూర్తవుతాయన్నారు.  భూత్పూర్ మున్సిపాలిటీలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్​మార్కెట్ నిర్మాణం పై రివ్యూ సందర్భంగా 15 రోజుల్లో పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ , ఇంజినీరింగ్​ఆఫీసర్లను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ కె.సీతారామరావు, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్​రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, ట్రాన్స్​కో ఎస్ఈ మూర్తి, మిషన్ భగీరథ ఎస్​ఈ వెంకటరమణ, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

యువజనోత్సవాలపై సమీక్ష

ఈ నెల 9 ,10 తేదీల్లో జిల్లా కేంద్రంలో  జరిగే స్టేట్ లెవల్ యువజనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు  అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్​లో​ యువజనోత్సవాల ఏర్పాట్లపై  సమీక్షించారు. ఈ ఉత్సవాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రారంభిస్తారన్నారు. ఫస్ట్​టైం రాష్ట్ర స్థాయి ఉత్సవాలను  జిల్లాలో నిర్వహిస్తుండడంతో ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారు.  వివిధ జిల్లాల నుంచి ఎంపికైన కళాకారులు వస్తారని, వారికి  ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఉత్సవాల్లో  ఫోక్​సాంగ్స్​, డ్యాన్స్​, కబడ్డీ ఎంపికలు  ఉంటాయన్నారు. అడిషనల్​కలెక్టర్లు తేజస్  నందలాల్ పవార్​, సీతారామారావు, జిల్లా క్రీడల అధికారి శ్రీనివాసులు, డిఫ్యూటీ సీఈవో మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.