బెదిరింపులు, కిడ్నాప్‌లు..మెదక్‌లో పెరుగుతున్న భూ వివాదాలు

V6 Velugu Posted on Oct 24, 2021

మెదక్ జిల్లాలో భూ పంచాయితీలు ఎక్కువయ్యాయి. భూముల విలువ బాగా పెరగడంతో వివాదాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో అమ్మిన భూమిని తమకే తిరిగి అమ్మాలని కొందరు పట్టుపడుతున్నారు. మార్కెట్ వ్యాల్యూ ఎక్కువగా ఉన్నా, తాము చెప్పిన రేట్ కే అమ్మాలని మరికొందరు ఒత్తిడి చేస్తున్నారు. అంగీకరించకుంటే సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఒక్కోసారి కిడ్నాప్​లకు పాల్పడుతున్నారు. భూములకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జిల్లాలో ఓ హత్య కూడా జరగడం గమనార్హం.

మెదక్, వెలుగు: జిల్లాలో భూముల రేట్లు భారీగా పెరిగాయి. గతంలో ఎకరానికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు రేట్ పలకగా, ఇప్పుడు రూ.20లక్షల నుంచి రూ.30లక్షలకు చేరింది. నేషనల్ హైవే వెంట ఉన్న, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న భూముల రేట్లు ఎకరం రూ.కోటి పలుకుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రం, ఎన్ హెచ్ మీద ఉన్న తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల పరిధిలో, జిల్లా మీదుగా ఉన్న 44, 161, 765 నేషనల్ హైవేల వెంట, మెయిన్ సిటీలు, మండల కేంద్రాల సమీపంలోని భూముల విలువ బాగా పెరిగింది. దీంతో అమ్మకాలు, కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు వివాదాలకు వెళ్తున్నాయి. బేరసారాలు కుదరకపోవడం, ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలకు దారితీస్తున్నాయి. ఇలాంటివి కొన్నిమాత్రమే బయటకు వస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ లీడర్ ధర్మాకర్ శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. భూములకు సంబంధించిన లావాదేవీల నేపథ్యంలోనే అతడి హత్య జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ డీలింగ్స్ లో కొందరితో తన భర్తకు గొడవలు ఉన్నట్టు భార్య హైందవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీను హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టణానికి చెందిన ఓ డాక్టర్ నెలరోజులకే హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హోటల్ లో సూసైడ్ చేసుకోవడం గమనార్హం. భారీగా భూముల కొనుగోలు వ్యవహారమే అతడి ఆత్మహత్యకు కారణమైందని తెలిసింది.

తక్కువ ధరకు అమ్మాలని..

కౌడిపల్లి మండలకేంద్రానికి చెందిన హరీశ్ కు గ్రామ శివారులో బాలానగర్ టు మెదక్ నేషనల్ హైవే దగ్గర తొమ్మిది ఎకరాల భూమి ఉంది. అతడి తల్లి పేర ఉన్న కోట్ల విలువైన భూమిని తమకు తక్కువ ధరకు అమ్మాలని స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల లీడర్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అతడు ఒప్పుకోకపోవడంతో వారు హైదరాబాద్ లో ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న అతడిని గత ఆదివారం బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన అతడి ఫ్రెండ్ 100కు డయల్ చేసి హరీశ్​ను కిడ్నాప్​ చేశారని చెప్పాడు. దీంతో పోలీసులకు తెలిసిపోయిందని కిడ్నాపర్లు అతడిని కౌడిపల్లి వద్ద వదిలేసి వెళ్లారు. ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్టు హరీశ్ తెలిపారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని అతడు చెప్పాడు.

చంపుతామని బెదిరింపులు

భూమి విషయంలో ఓ డాక్టర్, అతడి కొడుకు తనను చంపుతామని బెదిరిస్తున్నారని మెదక్ పట్టణానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు డాక్టర్ హవేలి ఘనపూర్ మండలం గంగాపూర్​లో ఉన్న 7.23 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ను 2018లో తనకు అమ్మారని తెలిపారు. తాము రిజిస్ట్రేషన్ చేసుకొని, తహసీల్దార్ ఆఫీస్​లో పేరు మార్పిడి కూడా చేసుకున్నామని తెలిపారు. కాగా ఇప్పుడు ఆ భూమి విలువ పెరగడంతో తిరిగి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారని, లేదంటే ఎంతకైనా తెగిస్తామని బెదిరిస్తున్నారని శ్రీహరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Tagged kidnaps, murder, Medak, Land Conflicts

Latest Videos

Subscribe Now

More News