వెయ్యి నామినేషన్లు వేసేందుకు సిద్ధం

వెయ్యి నామినేషన్లు వేసేందుకు సిద్ధం

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని చర్లగూడెం(శివన్నగూడెం), కిష్టరాయన్‌‌పల్లి రిజర్వాయర్‌‌ భూనిర్వాసితులు చేసిన ఈ ఆలోచనకు.. రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులు, ఇండస్ట్రీల నిర్వాసితులు తోడవుతున్నారు. నిమ్జ్, ఫార్మాసిటీ, మల్లన్నసాగర్, గౌరవెల్లి, మెగా టెక్స్ టైల్ పార్క్, డిండి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయి పరిహారం అందనోళ్లు తెలంగాణ  భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఇంటికో నామినేషన్ వేయనున్నారు. అలాగే మిషన్ భగీరథ స్కీమ్ నుంచి సర్కార్ తొలగించిన వర్క్ ఇన్‌‌స్పెక్టర్లు కూడా నామినేషన్లు వేసి తమ వాయిస్ వినిపించాలని నిర్ణయించారు. 

సర్కార్ తీరును నిరసిస్తూ.. 
రాష్ట్ర సర్కార్​ కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు, ఫార్మా సిటీ, నిమ్జ్, మెగా టెక్స్ టైల్ పార్క్ లాంటి ఇండస్ట్రియల్ జోన్ల కోసం లక్షల ఎకరాల భూములు సేకరించింది. ఇందులో చాలా చోట్ల భూనిర్వాసితులకు పూర్తి పరిహారం అందలేదు. ఇన్నాళ్లు రాష్ట్రంలో ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్న భూనిర్వాసితులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు తెలంగాణ భూనిర్వాసితుల సంఘం ఏర్పాటైంది. నిర్వాసితుల గొంతు వినిపించేందుకు మునుగోడు ఉప ఎన్నికను వేదికగా చేసుకోవాలని ఈ సంఘం భావిస్తోంది.  

భగీరథ సిబ్బంది సైతం.. 
మిషన్ భగీరథ స్కీమ్ లో పని చేసేందుకు 2015లో 662 మంది వర్క్ ఇన్ స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఇంటర్వ్యూ, రోస్టర్ పాయింట్లను అనుసరించే వీరిని చేర్చుకుంది. రెండేండ్ల తర్వాత వీళ్లను రెగ్యులరైజ్ చేస్తామని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. తీరా భగీరథ పనులు పూర్తయ్యాక వర్క్ ఇన్ స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు అందరినీ తొలగిస్తూ 2020 జూన్ 30న ఉత్తర్వులు ఇచ్చారు. తమను విధుల్లోకి తీసుకోవాలని రెండేండ్లుగా మంత్రులను, అధికారులను కలుస్తున్న బాధితులు.. మునుగోడులో కనీసం 50 నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఇంటికో నామినేషన్ వేస్తం..
వివిధ ప్రాజెక్టుల పేరుతో లక్షలాది ఎకరాల భూములను లాక్కున్న కేసీఆర్ ప్రభుత్వం.. వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో నిర్వాసితుల సమస్య అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చకు వచ్చేలా చేయడం కోసం ఇంటికో నామినేషన్ నినాదంతో కనీసం వెయ్యి మందిని బరిలో నిలుపుతం. 
- మొగుడంపల్లి ఆశప్ప, తెలంగాణ భూనిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు