
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ బంధువుల ఇళ్లల్లో ఈడీ దాడులు జరిపింది. ఢిల్లీ, ఎన్ సీఆర్, పాట్నా, ముంబై, రాంచీలోని మొత్తం 24 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో 1900 డాలర్ల నగదు, 540 గ్రాముల బంగారు బిస్కెట్లు, కిలోన్నరకు పైగా బంగారు నగలు, ఇది కాకుండా కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ,సేల్ డీడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తుల రూపంలో రూ. 350 కోట్ల లావాదేవీలు.. బినామీల పేర్లతో రూ. 250 కోట్లు,.. మొత్తం రూ. 600 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డీ ఉద్యోలను భూములు తీసుకొని ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బదులుగా అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పాట్నా , ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ ప్రదేశాలలో అనేక భూములను అక్రమంగా సంపాదించినట్లు తేలింది. ఈ కేసులో లాలూను, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ఇటీవలే ప్రశ్నించింది.