
- అసైన్డ్ భూములు లాక్కున్నారని ఫిర్యాదులు
- ప్రభుత్వం తమకు ఇచ్చిన ల్యాండ్స్‌ను
- ఆక్రమించారంటూ సీఎంకు బాధితుల లెటర్
- విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో దాదాపు వంద ఎకరాలను ఆక్రమించారని సీఎం కేసీఆర్‌కు బాధితులు కంప్లైంట్ చేశారు. మంత్రి, ఆయన అనుచరులు బెదిరించి.. ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను లాక్కున్నారంటూ ఈ రెండు గ్రామాలకు చెందిన పలువురు రైతులు కేసీఆర్‌కు లెటర్ రాశారు. జమున హాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోసం తమ భూములను లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా అన్ని మీడియా చానెళ్లలో వార్తలు రావడంతో సీఎం కేసీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. న్యూస్ టెలికాస్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే అసైన్డ్ భూముల ఆక్రమణ వ్యవహారంపై కేసీఆర్ విచారణకు ఆదేశించినట్లు సీఎంవో ప్రకటన జారీ చేసింది. కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో రిపోర్టు ఇవ్వాలని విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుకు ఆదేశాలిచ్చారు.
తమ భూములను మంత్రి ఈటల లాక్కున్నారంటూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్‌లకు అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన రైతులు చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరుశురాం, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల దుర్గయ్య, ఎరుకల రాములు లెటర్ ద్వారా కంప్లైంట్ చేశారు. మంత్రిపై చర్యలు తీసుకుని, తమ భూములు తిరిగి ఇప్పించాలని అందులో కోరారు. ‘సర్వే నంబర్ 130 /5,130/9,130/10లో ఒక్కో కుటుంబానికి ఎకరం 20 గుంటలు, అలాగే 130/2లో మూడు ఎకరాల భూమిని 1994లో ప్రభుత్వం అసైన్డ్ కింద కేటాయించింది. కొన్ని నెలల క్రితం మంత్రి అనుచరులు సూరి,అల్లి సుదర్శన్, యంజాల సుధాకర్ రెడ్డి తమ వద్దకు వచ్చి ఆ భూములను తమకు అమ్మాలని, భయపెట్టారు. ఆ తర్వాత భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు’ అని బాధితులు తెలిపారు. దాదాపు 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూముల పత్రాలను దౌర్జన్యంగా లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా పౌల్ట్రీ కోసం షెడ్డూలను నిర్మించారని తెలిపారు.
మంత్రి పేరు మీదికి మార్చాలని ఒత్తిడి: మాజీ కలెక్టర్
అనుచరులు కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ఆయన పేరు మీదకు మార్చాలని మంత్రి ఈటల రాజేందర్ ఒత్తిడి తెచ్చారని మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధర్మారెడ్డి ఆరోపించారు. ‘అసైన్డ్ భూములు తన పేరు మీదికి మార్చాలని మంత్రి రెండేళ్ల క్రితం అడిగారు. కానీ మేము అసైన్డ్ భూములు మీ పేరు మీదికి మార్చడానికి మాకు అధికారం లేదు. ఆ నిర్ణయం మంత్రి వర్గం మాత్రమే తీసుకుంటుందని చెప్పాను’ అని తెలిపారు.