రీ సర్వేతో డ్రామాలు.. అమీన్ పూర్‌‌లో అక్రమాలకు అధికారుల అండ

రీ సర్వేతో డ్రామాలు.. అమీన్ పూర్‌‌లో అక్రమాలకు అధికారుల అండ
  •         కబ్జాలపై రిపోర్టులు ఉన్నా.. కొత్త సర్వేల పేరుతో కాలయాపన
  •     చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని అక్రమ నిర్మాణాలు

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, మండల పరిధిలో అక్రమాలు ఆగడం లేదు. కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.  స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తే సర్వే చేసి ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ ఇస్తామని రొటీన్ డైలాగులు చెబుతున్నారు. ఆయా భూములకు హద్దులు చూపిస్తూ సర్వే రిపోర్టులు ఉన్నా.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ సర్వే చేస్తామని కాలయాపన చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.  ఇందుకోసం ఏళ్ల తరబడి టైమ్ తీసుకుంటుండడంతో ఈలోగా నిర్మాణాలు కంప్లీట్‌ అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.  అంతా అయిపోయాక కబ్జాదారులకు అనుకులంగా రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

చెరువు కనిపిస్తే చాలు 

అమీన్ పూర్‌‌ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లకు సంబంధించి ఇప్పటికే చాలా భూములు అన్యాక్రాంతమయ్యాయి. కిష్టారెడ్డిపేటలోని ఈద్గా ముందు సర్వే నెంబర్ 164లో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం, సర్వే నెంబర్ 131లోని నక్కలపాడు కుంట, పటేల్​గూడలోని సర్వే నెంబర్ 190, 188ల్లో తీగల సాగర్ చెరువు,  అమీన్​పూర్​ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 947లో శెట్టికుంట, సర్వేనెంబర్ 765లోని శంభునికుంట, బంధంకొమ్ము చెరువు, అమీన్​పూర్​ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లు, నారాయణరావు లే అవుట్​లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి పక్కా సర్వే రిపోర్టులు, రికార్డులు కూడా ఉన్నాయి. గతంలో స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు సర్వే చేసి ఆక్రమణలు నిజమేనని తేల్చారు. అయినా చర్యలు తీసుకోకుండా  మళ్లీ సర్వే చేస్తామని చెబుతుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. 

కబ్జాదారులకే అధికారుల సపోర్ట్‌

పాత రికార్డులు, సర్వే రిపోర్టులతో పాటు గతంలో ప్రజల ఫిర్యాదుతో సర్వే చేసిన రిపోర్టులు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాదారులకు సపోర్ట్‌ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.  ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రీసర్వే చేస్తామని కాలయాప చేస్తుండడం, కొన్నిచోట్ల కబ్జాదారులకు అనుకూలంగా రిపోర్టులు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పాత రిపోర్టులు ఉండగా కొత్త సర్వే ఎందుకని ప్రశ్నిస్తే ‘ఫిర్యాదు చేయడం వరకే మీ బాధ్యత ఆ తర్వాత మేము చూసుకుంటాం’ అని బదులిస్తున్నారు.

కిష్టారెడ్డి పేటలోని సర్వే నెంబర్ 131లో ఉన్న నక్కలపాడుకుంట 8 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కింద రెండున్నర ఎకరాల్లో ఎఫ్‌టీఎల్‌ ఉంది. ఈ చెరువు హద్దులను హెచ్ఎండీఏ గతంలోనే మార్క్ చేసి ఉంచింది. కానీ వాటిని పట్టించుకోని ఓ బీఆర్ఎస్‌ లీడర్ 30 గుంటల ఎఫ్టీఎల్ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా నిర్మాణం చేపట్టాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా అధికారులు జాయింట్ సర్వే చేస్తామని వివరణ ఇచ్చారు. కానీ, నిర్మాణాలు మాత్రం ఆపడం లేదు.
బీఆర్ఎస్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి అమీన్‌పూర్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 765లోని శంభునికుంట పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి దర్జాగా బిల్డింగ్‌ కడుతున్నాడు.  ఈ స్థలం వివాదంలో ఉండడంతో ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని కోర్టు నిర్దారించడంతో అధికారులు కూడా అవునని తేల్చారు.  కానీ, రిపోర్ట్‌ రెడీ చేయకుండా రీ సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.

కోర్టు ఆదేశాల ప్రకారమే...

శంభుని కుంట ఎఫ్టీఎల్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సర్వే చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నం.  గతంలో ఉన్న రిపోర్టులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నం. కిష్టారెడ్డిపేటలోని నక్కలపాడు కుంట విషయంలో ఫిర్యాదులు వచ్చాయి. ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేశాం. ఎఫ్టీల్ లోకి వచ్చే నిర్మాణాలను ఖచ్చితంగా తొలగిస్తాం. గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన ఎఫ్టీఎల్ మార్కులను కూడా పరిశీలిస్తున్నాం.
- దశరథ్, అమీన్ పూర్ తహసీల్దార్