
బ్యాంకింగ్ తరహాలో భూ లావాదేవీలు
కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్న ప్రభుత్వం
భూముల అమ్మకాలు, కొనుగోళ్ల డేటా బ్యాంకులకు అందేలా కొత్త విధానం
ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేయాలని సీఎం సూచన
ఎంఆర్వో, వీఆర్వోల ప్రత్యేక పవర్స్ కట్?
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు కొత్త చట్టం
హైదరాబాద్, వెలుగు: బ్యాంకింగ్ తరహాలో భూ లావాదేవీలను ఈజీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. బ్యాంకింగ్ సేవలంత సులభంగా ల్యాండ్ మ్యుటేషన్ ఉండేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేయనుంది. ఇప్పటిదాకా ఎంఆర్వో, వీఆర్వోలకు ఉన్న విచక్షణాధికారాలను కట్ చేస్తూ రెవెన్యూ చట్టం తయారు చేస్తునట్టు తెలిసింది. దీంతో మ్యుటేషన్ ప్రక్రియలో రెవెన్యూ అధికారుల పాత్ర నామమాత్రం కానుంది. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే నిర్ణీత గడువులో మ్యుటేషన్ పూర్తి చేయాలనే రూల్ను చట్టంలో పెట్టనున్నట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో రెండు రోజుల పాటు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని అధికారులను అదేశించారు. రెవెన్యూ శాఖలో ఉన్న 124 చట్టాల్లో కాలం చెల్లిన వాటిని పక్కన పెట్టి, మిగతా వాటిని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని సూచించారు.
టెక్నాలజీతో అవినీతికి చెక్
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఒక వ్యక్తి భూమిని రిజిస్టర్ చేయించుకున్నాక ఆ పత్రాలను తీసుకొని మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారుల వద్దకు తప్పకుండా వెళ్లాలి. రెవెన్యూ శాఖలో అవినీతికి ఇక్కడే బీజం పడిందనే అభిప్రాయాలున్నాయి. అందుకని మ్యుటేషన్ కోసం టెక్నాలజీ సాయం తీసుకోనున్నారు. కొత్త చట్టం ఆధారంగా మ్యుటేషన్ ఆన్ లైన్ లో జరగనుందని ఓ అధికారి తెలిపారు.
‘‘రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ వివరాలను సరి చూసి నిర్ణీత గడువులోగా రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేయాలి. కోర్ బ్యాంకింగ్ విధానాన్ని భూముల లావాదేవీలకు అమలు చేయాలని భావిస్తున్నాం. భూముల క్రయవిక్రయాలు జరిగిన వెంటనే ఆ సమాచారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతోపాటు బ్యాంకులకు కూడా అందించేలా కోర్ బ్యాంకింగ్ విధానాన్ని కొత్త చట్టంలో చేర్చనున్నారు” అని ఆ అధికారి వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ తయారు చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది. రుణాల మంజూరు, మార్ట్ గేజ్ తోపాటు ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాల కోసం ఈ–పాస్ బుక్ లను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చట్టసవరణ చేసింది. వీటి గురించి కొత్త చట్టంలో విధిగా పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
డిస్క్రిషనరీ పవర్స్ తీసేస్తే…!
రెవెన్యూలో అవినీతికి మూలం విచక్షణాధికారం(డిస్క్రిషనరీ పవర్) అని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆ విచక్షణాధికారాన్ని తొలగిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత చట్టం ప్రకారం మ్యుటేషన్ చేసే విషయంలో తహసీల్దార్/వీఆర్వోలకు మాత్రమే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేసి, ఆ భూమికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఆ వ్యక్తి పేరు మీద సదరు భూమిని మ్యుటేషన్ చేసే ప్రక్రియలో వీఆర్వో/తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చాలా సార్లు చెప్పారు. ‘మ్యుటేషన్ చేసే సమయంలో డిస్క్రీషనరీ పవర్స్ లేకుండా చేస్తే చాలు. రెవెన్యూలో ఇక అవినీతి అనేది ఉండదు. అంత సాఫీగా జరుగతది’ అని కేసీఆర్ అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.
వెంటనే మ్యుటేషన్ జరిగేలా..
భూమి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత నిర్ణీత గడువులోగా మ్యుటేషన్ జరిగేలా చట్టంలో రూల్స్ పొందుపరిచే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘‘రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం భూములు వివాదం లేకుండా ఉన్నాయి. క్లియర్ టైటిల్ ఉన్న భూములను మ్యుటేషన్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే రెవెన్యూ అధికారులకు చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. ఎలాంటి వివాదం లేని భూముల విషయంలో వెంటనే మ్యుటేషన్ జరిగేలా చట్టం ఉంటుంది’’ అని రెవెన్యూ శాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
బర్త్, క్యాస్ట్, డెత్ సర్టిఫికెట్స్ జారీలోనూ..
ప్రస్తుతం బర్త్, డెత్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ జారీలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కొత్త చట్టంతో అర్హులైన వారికి అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్ లైన్ ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఎవరికి బాధ్యతలివ్వాలో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, పరిష్కారాల కోసం 11న జరిగే కాన్ఫరెన్స్లో కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
పాస్ బుక్ క్లియర్గా ఉంటేనే..
పాస్ బుక్ క్లియర్ గా ఉన్పప్పుడే రెవెన్యూ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది రైతులకు పాస్ బుక్ లో ఉన్న భూమికి వాస్తవంగా ఉన్న భూమికి చాలా తేడా ఉంది. ముందు వాటిని సవరిస్తేనే భూ క్రయవిక్రయాల్లో వివాదాలు, అవినీతి ఉండవని అంటున్నారు. ‘‘కొత్త చట్టం అమలులో పాస్ బుక్ చాలా కీలకం. దాన్ని ఆధారంగానే క్రయవిక్రయాలు ఉంటాయి. రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకం ప్రామాణికం కాదు. ఈ–పాస్ పుస్తకం భవిష్యత్ లో చట్టబద్ధం కానుంది’’ అని ఓ అధికారి చెప్పారు.