హైకోర్టు నోటీసులతో భుజాలు తడుముకుంటున్న ఆఫీసర్లు, లీడర్లు

హైకోర్టు నోటీసులతో భుజాలు తడుముకుంటున్న ఆఫీసర్లు, లీడర్లు
  •     588 ఎకరాల ఆక్రమణలో అధికారులు, బీఆర్ఎస్ లీడర్ల పాత్ర
  •     ఆక్రమణలపై కోర్టుకెక్కిన సర్పంచ్​
  •     27 మందికి నోటీసులిచ్చిన ఉన్నత న్యాయస్థానం 
  •     సంగారెడ్డి జిల్లాలో ‘భూం’రాంగ్​ 

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పంచాయతీలో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం ఆఫీసర్లు, లీడర్ల మెడకు చుట్టుకుంటున్నది. రైతులకు, పేదలకు, ఎక్స్ సర్వీస్ మెన్లకు సర్వే నెంబర్ 261లో కేటాయించిన 588 ఎకరాల గవర్నమెంట్ భూములను ఆక్రమించుకొని వందల కోట్లు సొమ్ము చేసుకున్న కొందరు  లీడర్లు, ఆఫీసర్లు 
ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అని  తర్జన భర్జన పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన అన్నారం సస్పెండెడ్ ​సర్పంచ్​ తిరుమల వాసు తన పంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ అక్రమాలపై డిసెంబర్ లో హైకోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయస్థానం బుధవారం పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్ తో పాటు 27 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై రిట్​ పిటిషన్ ​ఎందుకు స్వీకరించకూడదో ఈనెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో  పేర్కొంది. అసైన్డ్, పేదలకు, ఎక్స్ సర్వీస్​మెన్లకు ఇచ్చిన భూములను రాజకీయ నాయకులు కబ్జా చేయడంపై సంజాయిషీ కోరడంతో చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.  

అసలేం జరిగిందంటే..

అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 261లో 588 ఎకరాలుండగా ఇందులో 315 ఎకరాలు పట్టా భూములు. మిగతా 273 ఎకరాల్లో కొంత అసైన్డ్ ల్యాండ్ ను తెలంగాణ రాకముందున్న ప్రభుత్వం వివిధ అవసరాల కోసం కేటాయించింది. 117 మంది రైతులకు ఒక్కో ఎకరా చొప్పున పంపిణీ చేసింది. ఈ రైతులందరికీ పాత పాస్​బుక్స్​ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకువచ్చిన ధరణి ఆన్ లైన్ పోర్టల్​లో వివరాలు కనిపించలేదు. యాజమాన్య హక్కుల సమస్య ఏర్పడడంతో అనేక మంది హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం ఇవే భూముల్లో 613 ప్లాట్లలో  లే అవుట్లు చేసి ఇందిరమ్మ కాలనీ పేరుతో ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున 300 మంది పేదలకు పంచింది. మిగిలిన ప్లాట్లు ఏమయ్యాయో ఇప్పటికీ అధికారులకు తెలియదు. ఇలా ఈ సర్వే నంబర్​లో చాలా వరకు భూములు కబ్జాకు గురయ్యాయి.  ఇందులో అధికార పార్టీ లీడర్లతో పాటు అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

రూ 1,500 కోట్లు దండుకున్నరు

అన్నారం సర్వే నంబర్ 261లోని భూములను కబ్జా చేసి సుమారు రూ.1500 కోట్ల వరకు దండుకున్నట్టు తెలుస్తోంది. స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సహా స్థానిక బీఆర్ఎస్ లీడర్లు కుమ్మక్కై దర్జాగా గవర్నమెంట్ భూముల్లో లే అవుట్లు చేస్తూ కోట్లాది రూపాయలు జేబుల్లో వేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ భూముల్లోని 10 ఎకరాల్లో గ్రీన్ లేక్ ప్రాపర్టీ డెవలపర్స్ పేరుతో లే అవుట్ చేసిన రియల్టర్లు ఎర్రగడ్డలోని అనైక ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి వందల ఎకరాలు ధారాదత్తం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అన్నారం సర్పంచ్ తిరుమల వాసు బహిరంగంగా ఆరోపించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బీఆర్ఎస్ లీడర్లు, అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

బినామీల ముసుగులో...

అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో అనధికారికంగా లే అవుట్లకు పర్మిషన్లు ఇచ్చి..ఫోర్జరీ సంతకాలతో కొందరు వార్డు మెంబర్ల కుటుంబీకుల పేరున చెక్కులు ఇచ్చి కోట్ల రూపాయల స్కామ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అవినీతిపై దర్యాప్తు చేయాలని గతంలో కంప్లయింట్​చేస్తే తూతూ మంత్రంగా ఆడిట్ రిపోర్టు తయారు చేసి రెండు రోజుల్లో ఎంక్వయిరీ పూర్తి చేసి క్లీన్ చిట్ ఇచ్చారన్న విమర్శలున్నాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని కొందరు వార్డు మెంబర్లు ఆందోళన చెందుతున్నారు. 2020 జూన్ 29న అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపై గుమ్మడిదల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసి లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఆర్డర్స్​వచ్చినా అధికారులు లెక్క చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.   

అక్రమాలను ప్రశ్నించినందుకే...

రైతులు, పేదల పక్షాన పోరాటం చేస్తున్నందుకు నన్ను టార్గెట్ చేసి సస్పెండ్ చేయించారు. కాంప్రమైజ్ అయి కేసులు ఉప సంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటున్నారు. మా కుటుంబ సభ్యులు భయపడుతున్రు. అందుకే న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించా. భూ అక్రమాలపై ప్రభుత్వం జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ, గ్రామ పంచాయితీ అధికారులు, లోకల్ లీడర్లపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. -  తిరుమల వాసు, సస్పెండెడ్ సర్పంచ్

విచారణ కొనసాగుతోంది

అన్నారం గ్రామ పంచాయతీలో భూ అక్రమాలు జరిగినట్టు గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించాం. సర్వేనెంబర్ 261లో ఎక్కువ భూముల కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగతా భూముల్లో అక్రమంగా క్రయవిక్రయాలు జరిగినట్టు వచ్చిన విమర్శలపై నేనే స్వయంగా సమీక్షించా. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత రైతులు, పేదలకు న్యాయం చేస్తాం. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - వీరారెడ్డి, అడిషనల్ కలెక్టర్