ల్యాండ్ సీలింగ్​ యాక్ట్​కు మించి కేసీఆర్​కు భూములు

ల్యాండ్ సీలింగ్​ యాక్ట్​కు మించి  కేసీఆర్​కు భూములు

చట్ట ప్రకారం ఒక ఫ్యామిలీకి 54 ఎకరాలే గరిష్టం
2017, 2018లో కేసీఆర్ దంపతుల పేరిట 56.295 ఎకరాలు
రెండేండ్ల పాటు గరిష్ట పరిమితిని దాటి 2.29 ఎకరాలు
2019 నుంచి నాలా కన్వర్షన్​తో తగ్గిన భూములు
ఎన్నికల అఫిడవిట్​తో వెలుగులోకి

నెట్ వర్క్, వెలుగు: ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కు మించి వ్యవసాయ భూమిని సీఎం కేసీఆర్ సుమారు ఐదేండ్ల పాటు కలిగి ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన సమర్పించిన అఫిడవిట్​తో స్పష్టమవుతున్నది. సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 54 ఎకరాలకు మించి భూమి ఉండొద్దు. అయితే, 2017 నుంచి 2018 మధ్య కేసీఆర్ దంపతుల పేరిట కొనుగోలు చేసిన మొత్తం వ్యవసాయ భూమి 54 ఎకరాలకు మించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గరిష్టంగా 56.2950 ఎకరాలు.. 

సీఎం కేసీఆర్ 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో అప్పటి మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవెల్లి విలేజ్ పరిధిలో 37.70 (38.30) ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ప్రకటించారు. 2010, సెప్టెంబర్ 21న 5.35 ఎకరాలు, 2010 సెప్టెంబర్ 22న 15.30 ఎక రాలు, 2013 ఏప్రిల్ 26న 2.105 ఎకరాలు, అదే ఏడాది.. అక్టోబర్ 18న 14 ఎకరాలు, అదే నెలలో 25న 1.04 ఎకరాలు కొనుగోలు చేశారు. 2014 మే 19న 4.025 ఎకరాలు, అదే ఏడాది జూన్ 30న 20 గుంటలు, 2015 మే 22న 4.08 ఎకరాలు, అదే ఏడాది అక్టోబర్ 1న 7 గుంటలు, 2016 ఏప్రిల్ 29న 1.16 ఎకరాలు, 2017 ఆగస్టు 30న 5.32 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక్కడి వరకే 54.05 ఎకరాల భూమితో గరిష్ట పరిమితికి చేరింది. కానీ, ఆ తర్వాత 2018 జనవరి 24న 32‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1/4 గుంటలు, అదే ఏడాది మార్చి 7న మరో 32‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1/4 గుంటలు కొనుగోలు చేశారు. ఈ భూములు కూడా లెక్క కడితే 56.295 ఎకరాల వ్యవసాయ భూమి వారి పేర్లపై కనిపిస్తున్నది. అప్పటి వరకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం.. వారి ఆధీనంలో అదనంగా 2.295 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అఫిడవిట్ లోని వివరాలు వెల్లడిస్తున్నాయి. యాక్ట్ ప్రకారం పరిమితికి మించి ఉన్న భూమిని సర్కార్ కు అప్పగించాల్సి ఉండగా.. అలా చేయలేదు.

ALSO READ : మతిలేదా.. మందేసినవా? కేసీఆర్​ కామెంట్లపై రేవంత్​ ఫైర్​

నాలా కన్వర్షన్ తో తగ్గించిందిలా..

సుమారు ఏడాదిన్నర తర్వాత 2019లో ఎర్రవెల్లిలో ఇంటి నిర్మాణం కోసం 1.25 ఎకరాల భూమిని.. 2019 సెప్టెంబర్ 30న నాలా కన్వర్షన్ చేయించారు. దీంతో వారి చేతిలో ఉన్న వ్యవసాయ భూమి 55.045 ఎకరాలకు చేరింది. ఆ తర్వాత స్థానిక సంస్థల పేరిట 1.18 ఎకరాల భూమిని ఎర్రవెల్లి పంచాయతీకి గిఫ్ట్ కింద ఇచ్చారు. ఆ తర్వాత 2022, ఏప్రిల్ 4న ఒకే సారి 9.365 ఎకరాల భూమిని నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేశారు. దీంతో వారి వ్యవసాయ భూమి విస్తీర్ణం 43.30 ఎకరాలకు చేరింది. ఈ ఏడాది జులై 19న మరో 10 ఎకరాలను వెంకటాపూర్ శివారులో కొనుగోలు చేయడంతో సీఎం కేసీఆర్, శోభమ్మ పేరిట మొత్తం భూమి 53.30 ఎకరాలకు చేరింది.