పీవోకేలో విరిగిపడ్డ కొండచరియలు.. తొమ్మిది మంది మృతి

పీవోకేలో విరిగిపడ్డ కొండచరియలు.. తొమ్మిది మంది మృతి

పెషావర్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌‌(పీవోకే)లోని గిల్గిత్ ప్రాంతంలో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తొమ్మిది మంది వాలంటీర్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి దన్యోర్ నుల్లాలో ఈ సంఘటన జరిగింది. నీటి కాలువను పునరుద్ధరించేటప్పుడు వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది వాలంటీర్లు మరణించారని అధికారులు తెలిపారు.

కార్మికులపై పెద్ద ఎత్తున మట్టి కూలిందని, శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని చెప్పారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పాట్‎కు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మరికొంత మంది వాలంటీర్లు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.