మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టిన ఎల్​ అండ్ టీ కంపెనీ

మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టిన ఎల్​ అండ్ టీ కంపెనీ
  •     ప్రభుత్వ హెచ్చరికలతో దిగొచ్చిన కాంట్రాక్ట్ సంస్థ 
  •     అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్న ఉద్యోగులు 

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవపూర్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ ఎల్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ టీ కంపెనీ.. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికలతో దిగొచ్చింది. బ్యారేజీ రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని మొన్నటిదాకా చెప్పిన కంపెనీ.. ఇప్పుడు బ్యారేజీ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. బ్యారేజీ 7వ బ్లాక్ లోని పిల్లర్లు కుంగగా... రిపేర్లు చేసేందుకు వీలుగా నీళ్లు రాకుండా 7, 8వ బ్లాక్ ల చుట్టూ కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నది. రెండ్రోజులుగా భారీ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి, రాళ్లు తీసుకొచ్చి పోస్తున్నది. బ్యారేజీ రిపేర్లలో భాగంగానే మొదటి దశలో రూ.55 కోట్ల విలువైన కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక పిల్లర్ల దగ్గర ఇసుకను తవ్వి చూస్తేనే బ్యారేజీ ఎంత మేరకు డ్యామేజీ అయింది? ఎంత నష్టం జరిగింది? అనే దానిపై క్లారిటీ రానుంది. కాగా, బ్యారేజీ వద్ద నిర్బంధం ఇంకా కొనసాగుతున్నది. అక్కడికి వర్కర్లను తప్ప ఎవ్వరినీ అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులు వెళ్తే అనుమతి లేదంటూ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ శాఖ నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ వస్తే తప్ప లోపలికి అనుమతించబోమని అంటున్నారు. మరోవైపు సర్కార్ ఇంజినీర్లు ఆఫీసుల్లో అందుబాటులో ఉండడం లేదు. ఫోన్లు చేసినా స్పందించడం లేదు. 

ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టీ డబుల్‌‌‌‌ గేమ్‌‌‌‌..
  
‌‌‌‌ఈ ఏడాది అక్టోబర్​లో మేడిగడ్డ బ్యారేజీ కుంగగా ‘డిఫెక్ట్‌‌‌‌ లయబిలిటీ పీరియడ్‌‌‌‌’ నిబంధనల్లో భాగంగా రిపేర్లన్నీ సొంత ఖర్చులతో ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ కంపెనీనే చేస్తుందని అప్పటి ఇరిగేషన్‌‌‌‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌‌‌‌కుమార్‌‌‌‌ మీడియాకు తెలిపారు. అదేరోజు ఎల్‌‌‌‌అండ్‌‌‌‌ టీ జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ సురేశ్ కుమార్‌‌‌‌ కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎల్అండ్ టీ కంపెనీ మాట మార్చింది. డిఫెక్ట్‌‌‌‌ లయబిలిటీ పీరియడ్‌‌‌‌ 2022 జూన్‌‌‌‌ 29నే ముగిసిందని, రిపేర్లకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని లేఖ రాసింది. కాఫర్‌‌‌‌‌‌‌‌ డ్యామ్ నిర్మాణానికి  రూ.55.75 కోట్లు, బ్యారేజీ పునరుద్ధరణ పనులకు రూ.500 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొంది. అయితే ఎల్అండ్ టీ మాట మార్చడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఎల్అండ్ టీ దిగొచ్చింది.