SL vs AFG: లంక బ్యాటర్ సంచలనం.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ

SL vs AFG: లంక బ్యాటర్ సంచలనం.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు(ఫిబ్రవరి 9) శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య పల్లకెలె వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక(210 నాటౌట్) ద్విశతకంతో కదం తొక్కాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన తొలి లంక బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో క్రికెటర్‌గా రికార్డులోకెక్కాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన  ఆఫ్ఘన్లు.. లంకేయులను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఇదే వారు చేసిన మొదటి, చివరి తప్పు. బ్యాటింగ్‌కు దిగిన లంక బ్యాటర్లు అది నుంచే దూకుడు ప్రదర్శించారు. టీ20 తరహాలో బౌండరీల వర్షం కురిపించారు. తొలి వికెట్‌కు నిస్సంక(210 నాటౌట్)- ఆవిష్క ఫెర్నాండో(88: 88 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోడి 182 పరుగులు జోడించింది. వీరిద్దరూ ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి లంక వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఫరీద్ అహ్మద్ విడగొట్టాడు.

ALSO READ :- నేను చేసింది తప్పే.. ఇంగ్లాండ్ కోచ్‌కు గంభీర్ క్షమాపణలు

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్(16) త్వరగా ఔటైనా.. సుధీర సమరవిక్రమ(45; 36 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్‌కు నిస్సంకతో కలిసి 125 పరుగుల భాగస్వామ్యం నెలకొపల్పాడు. ఒక ఎండ్ నుంచి సహచరులు వీడుతున్న మరో ఎండ్ నుంచి నిస్సంక నిలకడగా ఆడుతూనే వచ్చాడు. మొత్తంగా 139 బంతుల్లో ఎదుర్కొన్న అతడు 20 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 210 పరుగులు చేశాడు. దీంతో లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పయి 381 పరుగులు చేసింది. అఫ్ఘన్ల పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్ కూడా లంకేయుల భారీ స్కోర్‌కు ఒక కారణం.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన లంక ఆటగాళ్లు

  • పథుమ్ నిస్సంక(210*)  vs ఆఫ్ఘనిస్తాన్(2024)
  • సనత్ జయసూర్య (189) vs ఇండియా(2000)
  • ఉపుల్ తరంగ (174*) vs ఇండియా(2013)
  • కుమార సంగక్కర(169) vs దక్షిణాఫ్రికా(2013)
  • తిలకరత్నే దిల్షాన్(161*) vs బంగ్లాదేశ్(2015)