- మినీ మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో జనం
- అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు
మినీ మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో జనం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్ జాతరకు పకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి సమీపంలో మద్దిమేడారం, టేకుల మేడారం జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం శివారు వట్టివాగు వద్ద, ఏపూర్ శివారు గబ్బిలాల మడుగు వద్ద సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వనమంతా జనంతో నిండిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మినీ మేడారానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. - శాయంపేట(ఆత్మకూర్)/ నల్లబెల్లి/ గూడూరు/ మొగుళ్లపల్లి, వెలుగు
