నేటి నుంచి సాగర్​ జలాలపై లేజర్​, సౌండ్ షో

నేటి నుంచి సాగర్​ జలాలపై లేజర్​, సౌండ్ షో

హైదరాబాద్, వెలుగు: కేంద్ర పర్యాటక శాఖ సిటీలో మరో కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తోంది. హుస్సేన్​ సాగర్​లో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్​పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. లేక్​అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ, భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసిన ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగు రంగుల లేజర్ లైట్ల వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రముఖ రచయిత ఎస్.ఎస్.కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని సునీత గాత్రాన్ని అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ షోను డిజైన్ చేసినట్టు అధికారులు తెలిపారు. లేజర్​షోను 800 నుంచి1000 మంది కూర్చుని చూసేలా ఏర్పాటు చేశారు.