
షోపియాన్: జమ్ము కశ్మీర్లోని షోపియాన్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు ఉగ్రవాదులపై భద్రతా బలగాలు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది హతమైనట్లు తెలిసింది. కుల్గాంలో మొదలైన ఎన్ కౌంటర్ షోపియాన్లోని అటవీ ప్రాంతంలో కొనసాగుతోంది. ఆర్మీ, పారామిలటరీ బలగాలు రెండు గంటలకు పైగా ఉగ్రవాదులపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఉగ్రవాదుల జాడను కనుగొన్న భద్రతా బలగాలు కాల్పులు జరపడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత భద్రతా బలగాలు ముందుకెళుతున్న సంగతి తెలిసిందే.
భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాది లష్కర్-ఈ-తోయిబా గ్రూప్కు చెందిన టెర్రరిస్ట్ అని తెలిసింది. కశ్మీర్లో టెర్రర్ ఫ్రీ కశ్మీర్ పోస్టర్లు కనిపించిన గంటల వ్యవధిలోనే ఈ ఎన్ కౌంటర్ మొదలవడం గమనార్హం. ముగ్గురు పాకిస్తానీ టెర్రరిస్టుల ఫొటోలతో పోస్టర్లు కనిపించాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి కారకులైన అనుమానితులుగా పేర్కొంటూ ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదుల ఫొటోలతో పోస్టర్లు కనిపించాయి. ఎన్ కౌంటర్ జరుగుతున్న ఇదే షోపియాన్ జిల్లాలో ఈ అనుమానితుల ఆచూకీ తెలిపితే 2 లక్షల రివార్డు ఇస్తామని పోస్టర్లు కనిపించడం గమనార్హం.