మార్కెట్ల పతనంలో ఇన్వెస్టర్స్ చేయాల్సిందిదే.. వాస్తవం చెప్పిన మ్యూచువల్ ఫండ్ సీఈవో

మార్కెట్ల పతనంలో ఇన్వెస్టర్స్ చేయాల్సిందిదే.. వాస్తవం చెప్పిన మ్యూచువల్ ఫండ్ సీఈవో

గతవారం గందరగోళం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ సోమవారం ఒక్కసారిగా ర్యాలీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్లు ఎంత కఠినంగా ఉంటాయనే విషయం గురించి ఈ క్రమంలో ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా పేర్కొన్నారు. అనుకోకుండా ఇండియాపాక్ కాల్పుల విరమణ, అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం వంటి నిర్ణయాలు ఒకేసారి రావటంతో ఈక్విటీ మార్కెట్లలోని అన్ని రంగాలు లాభాల సునామీతో ఇన్వెస్టర్లను ముంచెత్తిన సంగతి తెలిసిందే.

అయితే స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనైనప్పుడు ఏం చేయాలి, అప్పుడు వచ్చే నష్టాలను ఎలా అరికట్టాలి అనే అనుమానాలు చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లోనే ఇన్వెస్టర్లు తెలివిగా వ్యవహరించి సంయమనం పాటించాలని ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా అన్నారు. వాస్తవానికి ఏడాది మెుత్తంలో రాబడి కేవలం కొన్ని రోజుల నుంచి లభిస్తుందని ఆమె అన్నారు. అయితే ఖచ్చితంగా మార్కెట్లు ఏ రోజు ర్యాలీతో రివార్డ్ చేస్తాయనే విషయాన్ని గుర్తించటం అస్సలు వీలుకానిదిగా ఆమె పేర్కొన్నారు.

వాస్తవానికి ఇలాంటి సమయాల్లో సాధారణ ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లకు సైతం కఠినంగా ఉంటుందని అన్నారు. మార్కెట్లో కొనుగోళ్లతో ఎంట్రీ, ఎగ్జిట్ అలాగే రీఎంట్రీలు తీసుకోవటం చాలా కఠినంగా ఉంటుందని చెబుతూనే.. సాధారణ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో ఉంటారు కాబట్టి క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు సాగటం మంచిదని ఆమె సూచించారు. ఇక్కడ కావాల్సిందల్లా ఇన్వెస్టర్లు ఓర్పుతో ఉండటమేనని రాధికా పేర్కొన్నారు.