WTC Final: స్టార్ ఆల్ రౌండర్ రీ ఎంట్రీ.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

WTC Final: స్టార్ ఆల్ రౌండర్ రీ ఎంట్రీ.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా తమ స్క్వాడ్ ను ప్రకటించింది. మంగళవారం (మే 13) 15 మంది ఆటగాళ్ల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. గాయం కారణంగా శ్రీలంక సిరీస్ కు దూరమైన పాట్ కమ్మిన్స్ తిరిగి కెప్టెన్ గా తన బాధ్యతలను స్వీకరిస్తాడు. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. గాయంతో దూరమైన కీలక ఆటగాళ్లు  జోష్ హాజిల్‌వుడ్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌లు ఆసీస్ జట్టులోకి వచ్చారు. జూన్ 11న సౌతాఫ్రికాతో జరగబోయే ఫైనల్ కు ఆసీస్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది.

కెప్టెన్ కమిన్స్‌తో పాటు  మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, హాజిల్‌వుడ్ లతో పేస్ విభాగం అత్యంత దుర్బేధ్యంగా కనిపిస్తుంది. నాథన్ లియాన్, మాట్ కుహ్నెమాన్‌ల రూపంలో స్పిన్నర్లుగా జట్టులో కొనసాగనున్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భారత్ పై ఆకట్టుకున్న టీనేజర్ సామ్ కాన్స్టాస్ స్క్వాడ్ లో స్థానం దక్కించుకున్నాడు. గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ బాధ్యతలు మోయనున్నారు. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్‌ బ్యాటింగ్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. కీపర్ అలెక్స్ కారీ వికెట్ కీపర్ గా.. అతనికి రిజర్వ్ గా బ్రెండన్ డాగెట్ సెలక్ట్ అయ్యాడు. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 మధ్య జరగనుంది.  జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా 2023 ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి. 

ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్