పాన్ – ఆధార్​లింక్ కు 30నే లాస్ట్​డేట్

పాన్ – ఆధార్​లింక్ కు 30నే లాస్ట్​డేట్

పాన్ – ఆధార్​లింక్ కు 30నే లాస్ట్​డేట్ — ఆలోపు లింక్ చేయకుంటే పాన్ కార్డ్​ రద్దయితది

    నకిలీ కార్డులను అరికట్టేందుకు కేంద్రం యోచన

    ఐటీ రిటర్నుల ఫైలింగ్ ఆధార్‌‌ తో చేయాల్సిందే 

    పాన్‌‌ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు..అన్నింటికీ కష్టం

మీరు పాన్‌‌ కార్డు (పర్మినెంట్‌‌ అకౌంట్‌‌ నంబర్‌‌)తో ఆధార్‌‌తో లింక్‌‌ చేయలేదా? అయితే ఇక మీ కార్డు డియాక్టివేట్‌‌ కానుంది. అవును.. సెప్టెంబర్‌‌ 30 తేదీ వరకు పాన్‌‌ కార్డుకు ఆధార్‌‌ కార్డును లింక్‌‌  చేయకపోతే అక్టోబర్‌‌ ఒకటో తేదీ నుంచి పాన్‌‌ కార్డు పనిచేయదు. దీంతో పాన్‌‌ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందేందుకు వీలుండదు. ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి, పన్ను సంబంధిత లావాదేవీలకు వ్యక్తిగత గుర్తింపు వర్తించదు. ఒక వేళ పాన్‌‌ కార్డు లేకుండా ట్యాక్స్‌‌ చెల్లించాలంటే ఆధార్‌‌ నంబర్‌‌ జత చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డులు ఉన్నవారంతా తమ ఆధార్ నంబర్లను లింక్ చేయాలని ఐటీ శాఖ చాలా రోజుల నుంచే చెబుతోంది. గతంలో పాన్‌‌, ఆధార్‌‌ లింక్  చేసుకోవాలని కార్డుదారులను ఎన్నోసార్లు అలర్ట్‌‌ చేసి, గడువులను కూడా పొడిగించింది. మొదట 2018 జూన్‌‌ 30వ తేదీని గడువుగా నిర్ణయించగా, ఆ తర్వాత పొడిగించి, 2019 మార్చి 31వ తేదీకి మార్చారు. అయినా, చాలా మంది లింక్ చేసుకోకపోవడంతో గడువును మరోసారి సెప్టెంబర్‌‌ 30వ వరకు ఎక్స్‌‌టెండ్‌‌ చేశారు.

లింక్ చేయకపోతే ఏమవుతుంది? 

ఈ నెల 30 నాటికి పాన్‌‌ కార్డుకు ఆధార్‌‌ లింక్‌‌ చేయకపోతే తాత్కాలికంగా సస్పెండ్ అవుతుంది. పాన్ కార్డు లేని వారు ఐటీ రిటర్నులను ఆధార్ ద్వారా సమర్పించవచ్చు. దీంతో ఇన్‌‌కం ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌ ఒక కొత్త పాన్ నంబర్‌‌ను కేటాయిస్తుంది. దీన్ని ఆన్‌‌లైన్‌‌లో కూడా డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్త పాన్ నంబర్‌‌ను ఆధార్‌‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి లింక్‌‌ చేశాక, వాటిని పునరుద్ధరించుకోవచ్చు. లేకపోతే పాన్ కార్డును శాశ్వతంగా తొలగిస్తారు.

లింక్‌‌ ఎలా చేయాలి?

మీరు పాన్ కార్డును -ఆధార్ కార్డుతో లింక్ చేశారో లేదో చాలా సింపుల్ గా తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా ఈ లింక్​ను
(www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html) ఓపెన్ చేయండి.

ఆ వెబ్​పేజీలో సూచించిన చోట పాన్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అంతే.. పాన్, ఆధార్​ఇదివరకే లింక్​అయ్యాయో, లేదో వాటి స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ మీ పాన్, ఆధార్​లింక్ కాకుంటే, వాటిని లింక్​చేసేందుకు ఇన్‌‌కం ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌ అఫీషియల్​వెబ్​సైట్​(www.incometaxindiaefiling.gov.in) లోకి వెళ్లి ఈజీగా లింక్ చేయొచ్చు. ఇందుకోసం వెబ్​సైట్​ను ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్‌‌లో క్విక్ లింక్స్‌‌లో కనిపించే ‘Link Aadhaar’ అనే ట్యాబ్‌‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీలో పాన్, ఆధార్ నంబర్, ఆధార్‌‌పై ఉన్న పేరు, క్యాప్చా కోడ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి పాన్- ను ఆధార్​తో లింక్ చేయొచ్చు.

నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే..

పాన్‌‌ కార్డు లేకుండా అక్రమంగా లోన్లు, క్రెడిట్‌‌ కార్డులు పొందడం వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఐటీశాఖ భావిస్తోంది. నేపాల్‌‌, భూటాన్‌‌కు చెందిన కొందరు తమ ఐడీ ప్రూఫ్‌‌తో ఈజీగా లోన్లు, క్రెడిట్‌‌ కార్డులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకరి పేరుపై రెండు కార్డులు జారీ కావడం, కొందరు నకిలీ పాన్ కార్డులు తీసుకోవడం లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆధార్ నంబర్ లింక్ చేస్తే అవన్నీ బయటపడే అవకాశం ఉంది. దీంతో నకిలీ పాన్‌‌ కార్డులను  అరికట్టడం కోసం కేంద్రం ఆధార్‌‌, పాన్‌‌ కార్డు లింక్‌‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది.

పాన్‌‌తో ప్రయోజనాలెన్నో..

పాన్‌‌కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకునేందుకు, ఐటీ రిటర్నుల ఫైలింగ్​కు పాన్ అవసరం. టూవీలర్ మినహా ఇతర వాహనాలను కొనాలన్నా, విక్రయించాలన్నా అవసరం. బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించేందుకు కూడా తప్పనిసరి. రూ.50,000 డిపాజిట్లకు, ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులకు పాన్‌‌ ఉండాలి. కంపెనీల షేర్లు కొనాలన్నా, విక్రయించాలన్నా పాన్ కావాలి. లావాదేవీ విలువ రూ.లక్ష దాటితే పాన్ నంబర్ అందించాలి. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకం సమయంలో కూడా పాన్ వివరాలు ఇవ్వాలి. ఓటర్ కార్డు, ఆధార్ కార్డులానే పాన్ కార్డు కూడా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది. ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిఫండ్, ట్యాక్స్ డిడక్షన్ వంటి వాటికి కూడా పాన్ కార్డు అవసరం.