సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థలు టాస్, ఆర్ఐఏ ప్రకటించాయి. ఆయన 1985 నుంచి 1991 వరకు సోవియట్ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు, సోవియట్ నేతృత్వంలోని తూర్పు దేశాలకు మధ్య ఏళ్ల తరబడి జరిగిన కోల్డ్ వార్ ని ముగించిన వ్యక్తిగా మిఖాయిల్ కు గుర్తింపు ఉంది.
కోల్డ్ వార్ ముగించినందుకు గోర్బచేవ్ కు 1990లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ, రష్యాలో మాత్రం ఎక్కువగా ఆయన్ని సోవియట్ విచ్ఛిన్నానికి కారణమైన వ్యక్తిగా చూస్తారు. కాగా, మిఖాయిల్ మృతి పట్ల వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు మాస్కోలోని నొవోడెవిచి శ్మశాన వాటికలో జరగనున్నాయి.
