నకిలీ విత్తనాలకు అడ్డుకట్టపడేనా..టాస్క్ ఫోర్స్ తనిఖీలు

నకిలీ విత్తనాలకు అడ్డుకట్టపడేనా..టాస్క్ ఫోర్స్ తనిఖీలు
  • కల్తీ విత్తనాలు అంటగడుతున్న  వ్యాపారులు
  • జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ తనిఖీలు
  •  ఫర్టిలైజర్ వ్యాపారుల మాయజాలంతో గతేడాది నష్టాలు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో  వానకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు.   అయితే ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా రైతులను నకిలీ విత్తనాల భయం వెంటాడుతోంది.   ప్రతి ఏడాది ఫర్టిలైజర్ వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారు. వానకాలం సాగుకు నెల రోజుల ముందుగానే రైతులు పత్తి, సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో కొంత మంది ఫర్టిలైజర్ వ్యాపారులతో పాటు దళారులు   నకిలీ విత్తనాలు రైతులకు అంటగడుతున్నారు.   ఆ విత్తనాలు  మొలకెత్తక రైతులు  నష్టపోతున్నారు. గతేడాది జిల్లాలోని జైనథ్, బేల, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలు రైతులు సోయాబిన్ విత్తనాలు మొలకెత్తలేదంటూ జిల్లా కేంద్రంలోని   ఆందోళనకు దిగారు. విక్రాంత్ రకం సోయా విత్తనాలు వేసిన రైతులకు మొలకెత్తక తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఈఏడాది 5.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 3.65 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుంది. 

వ్యాపారుల దోపిడి..

గతంలో ఫేక్​ సీడ్స్​ వల్ల రైతులు నష్టపోవడంతో కంపెనీలతో అధికారులతో పాటు ఎమ్మెల్యే జోగురామన్న చర్చలు జరిపి పరిహారం అందిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు.  గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన సోయాబిన్ విత్తనాలు మొలకెత్తకపోవడంతో 20 వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారు.  రెండేళ్ల నుంచి నుంచి సోయాబిన్ పై సబ్సిడీ లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి  వ్యాపారులు కల్తీ విత్తనాలు  అంటగడుతున్నారు. 

2021 వానకాలం సాగులో సైతం జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి విత్తన బ్యాగుపై ఉన్న ఎమ్మార్పీ ధరను మార్చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.  కొంత మంది రైతులు దీనిపై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. మరో వ్యాపారి విత్తనాలు మొలకెత్తకుంటే తన బాధ్యత కాదంటూ రైతుల నుంచి ముందే బాండ్ పేపర్ల పై సంతకాలు తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఇలా ప్రతి ఏడాది మోసాలు బయపటపడుతున్నా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. 

టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు..

జిల్లాలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉంటాయి. దీంతో పత్తి, సోయా పంటలు ఎక్కువగా సాగుచేస్తారు. అయితే ప్రతి ఏడాది వానకాలం   సీజన్​కు   ముందు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసులు,   టాస్క్ ఫోర్సు అధికారులు   ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేస్తుంటారు.  అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేయడంతోనే వ్యాపారులు రైతులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా విత్తనాలు మొలకెత్తలేదంటూ రైతులు రోడ్లపై ఆందోళనకు దిగాల్సి వస్తోంది. 

ఆరు ఎకరాల్లో నష్టపోయా

బేల మండలంలోని సిర్సన గ్రామానికి చెందిన అజయ్ రెడ్డి గతేడాది కల్తీ విత్తనాలు వేసి నష్టపోయాడు. ఆరు ఎకరాల్లో సోయాబిన్ విత్తనాలు 6 బ్యాగులు వేయగా  15 రోజులైన సోయ విత్తనాలు మొలకెత్తలేదు. మిగతా రైతుల పంటలు రావడంతో తాను మోసపోయానని గుర్తించాడు. పరిహారం కోసం అధికారులు చుట్టూ తిరిగిన ఇంత వరకు పట్టించుకోలేదు. రూ. 50 వేల వరకు నష్టపోయినా.. గతంలో రూ. 5 వేల పరిహారం ఇస్తామన్నారు కాని ఇవ్వలేదు. 

అజయ్ రెడ్డి, సిర్సన  బేల రైతు