లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత

లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత
  • పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస
  • ముంబైలోని శివాజీ పార్క్‌‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • హాజరైన ప్రధాని మోడీ, సీఎం ఉద్ధవ్, సచిన్, షారూఖ్..
  • వేలాదిగా తరలివచ్చిన అభిమానులు.. 
  • దేశవ్యాప్తంగా జాతీయ జెండాలు అవనతం
  • భారతరత్న, ఫాల్కే వంటి ఎన్నో అవార్డులు అందుకున్న లత
  • 80 ఏళ్ల కెరియర్.. 36 భాషల్లో వేలాది పాటలు

ముంబై: ఎనభై ఏండ్ల పాటు సాగిన స్వర రాగ గంగా ప్రవాహం ఆగిపోయింది. వేల పాటలను ఆలపించిన గొంతుక మూగబోయింది. సంగీత సరస్వతి, భారతరత్న, లెజెండరీ గాయని లతా మంగేష్కర్ (92) ఇక లేరు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8.12కి తుది శ్వాస విడిచారు. సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్ మైదాన్‌‌లో ప్రభుత్వ లాంఛనాలతో అభిమానుల కన్నీళ్ల మధ్య లత అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్ తదితరులు హాజరై.. గాన కోకిలకు తుది వీడ్కోలు పలికారు.

లతా మంగేష్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెల కిందట కరోనా సోకింది. మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో జనవరి 8న చేరారు. ఆమెకు న్యుమోనియా కూడా ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. జనవరి ఆఖరికల్లా ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని, ఐసీయూలో అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంచామని డాక్టర్లు చెప్పారు. కానీ మరోసారి ఆమె హెల్త్ కండీషన్  సీరియస్ కావడంతో వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉంచినట్లు శనివారం తెలిపారు. ఈ క్రమంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల లత చనిపోయారని ఆమెకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సందానీ ఆదివారం వెల్లడించారు. మరణంతో నెల రోజులపాటు పోరాడి ఓడారు లత. రెండు రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆమె మృతికి సంతాపంగా ఆది, సోమవారాల్లో జాతీయ జెండాను అవనతం చేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌‌‌‌‌‌‌‌లకు కేంద్ర హోం శాఖ వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ మెసేజ్ పంపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం మహారాష్ట్రలో సెలవు ప్రకటించారు.

తోబుట్టువులు, అభిమానులు వెంట రాగా..
లత మరణవార్త తెలుసుకుని వేలాది మంది అభిమానులు హాస్పిటల్ దగ్గరికి, సౌత్ ముంబైలోని ప్రభు కుంజ్ నివాసానికి చేరుకున్నారు. లత పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ముందుగా ప్రభు కుంజ్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ రోడ్డు మొత్తం అభిమానులతో నిండిపోయింది. చెట్లు, గోడలు, బిల్డింగులు.. ఎటు చూసినా జనమే. ఆ తర్వాత శవపేటికకు జాతీయ జెండా కప్పి.. పూలతో అలంకరించిన వాహనంలో ఉంచారు. లత తోబుట్టువులు మీనా, ఆశా, ఉష, హృదయనాథ్, ఇతర బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రభు కుంజ్ నుంచి శివాజీ పార్క్‌‌‌‌‌‌‌‌ వరకు అంతిమయాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు వెంట నడిచారు. లతాజీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పాటలు పాడారు. శివాజీ పార్క్‌‌‌‌‌‌‌‌ మైదాన్‌‌‌‌‌‌‌‌లో లత పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్ తదితరులు నివాళులర్పించారు. తర్వాత అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.